ఇందల్వాయి: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన బాలుడు నోముల బద్దం ఆరూష్ రెడ్డి ప్రతిభ చాటాడు. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ ఆధ్వర్యంలో మే నెల చివరి వారంలో జరిగిన ఈపోటీల్లో ఆరూష్ రెడ్డి కాంస్య పతకాన్ని సాధించినట్లు తల్లిదండ్రులు గౌతమి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఆరూష్‌రెడ్డిని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ అర్బన్ : చెస్ ఆడటం ద్వారా పిల్లలు చదువులో కూడా ముందంజలో ఉంటారని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని అభ్యాస ద స్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–11 బాలబాలికల చెస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిత్య సాధనతో చెస్ క్రీడలో ముందుకెళ్లవచ్చని తెలిపారు. బాలుర విభాగంలో విజేతలుగా సోహన్ (మోడల్ స్కూల్, ఆర్మూర్), ఆర్. అర్జన్ (ప్రెసిడెన్సీ స్కూల్), బాలికల విభాగంలో నిత్యశ్రీ (విజయసాయి, బోధన్), సాయి సహారా (కిడ్స్ టౌన్, బోధన్)లు నిలిచారు. నిత్యశ్రీ, సాయి సహారా బోధన్‌లోని సాయి సామల చెస్ అకాడమీలో శిక్షణ పొందారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ ప్రతినిధులు ఏ.రమేశ్, ఆర్బిటర్ శివ, సాయిబాబా పాల్గొన్నారు.
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సులో ఆర్మూర్ నుంచి భీమ్‌గల్‌కు ప్రయాణించింది. ప్రయాణికులంతా వెళ్లిపోవడంతో డ్రైవర్ భాషాఖాన్, కండక్టర్ శ్రీనివాస్ బస్సును తనిఖీ చేయగా, సీట్లో పర్సు కనిపించింది. వెంటనే తెరిచి చూడగా, అందులో 5 తులాల బంగారం ఉంది. దీంతో డ్రైవర్, కండక్టర్ కలిసి పర్సు మరిచిపోయిన ప్రయాణికురాలి ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆమె ఆచూకీ తెలుసుకొని పర్సు, అందులోని బంగారాన్ని అప్పగించారు. పర్సు తీసుకున్న సదరు ప్రయాణికురాలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది.


