కామారెడ్డి క్రైం: జిల్లాలో నెల రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 159 సెల్‌ఫోన్‌లను రికవరీ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 25.44 లక్షలు ఉంటుందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మ్తొతం రూ. 7.90 కోట్ల విలువైన 4,939 సెల్‌ఫోన్‌లను రికవరీ చేశామన్నారు. ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే పాత సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. రికవరీ చేసినవాటి వివరాలను బాధితులకు తెలియజేస్తామని, వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్‌ఎస్సై బాల్‌రాజు (87126 86114) ను సంప్రదించి ఫోన్‌లు తీసుకువెళ్లాలని సూచించారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లావ్యాప్తంగా గురువారం ఒకే రోజు 383 మందికి కోర్టులు శిక్షలు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపరచగా.. ఇద్దరికి 5 రోజులు, ఒకరికి 3 రోజులు, నలుగురికి 2 రోజులు, 46 మందికి ఒకరోజు జైలు శిక్షలతో పాటు మొత్తం 383 మందికిగాను రూ.4,93,500 జరిమానాలను విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమన్నారు. జిల్లావ్యాప్తంగా క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


