కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని వార్డుల్లో సానిటేషన్ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పర్వతాలు హెచ్చరించారు. బుధవారం ఉదయం ఆయన 15, 16, 17 వార్డుల్లో పర్యటించి, పారిశుధ్య పనులను పరిశీలించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు తాగునీటి సరఫరా, వీధిలైట్ల సమస్యలపై సంబంధిత అధికారులు, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ కార్మికులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ టీపీవో వినీత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


