● 12 కేసుల ఛేదన..
చోరీ సొత్తు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన ఎస్పీ
రాజేశ్‌చంద్ర
కామారెడ్డి టౌన్ : గంజాయితో పట్టుబడిన నిందితుల వద్ద కూపీ లాగితే వరుస చోరీల కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాహనాలు, మొబైల్ ఫోన్లు, షట్టర్ లిఫ్టింగ్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను కామారెడ్డి పట్టణ, సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ రాజేశ్‌చంద్ర కేసు వివరాలను వెల్లడించారు. పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్ కాలనీ డీలక్స్ బేకరీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు బుధవారం గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో పట్టణ ఎస్సై సాయికృష్ణ, సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, రాష్ట్రవ్యాప్తంగా వారు చేసిన వరుస ఆస్తి నేరాల చిట్టా బయటపడింది. రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన తిలిపితియ రూబిన్‌సింగ్ అలియాస్ రూబిన్‌సింగ్, మంగళ్‌సింగ్ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. గంజాయి, మద్యం వ్యసనాలకు బానిసలైన వీరు జల్సాల కోసం డబ్బులు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. వివిధ జిల్లాల్లో తిరుగుతూ మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు, ఇళ్ల తాళాలు పగలగొట్టడం, దుకాణాల షట్టర్లు లేపి దొంగతనాలకు పాల్పడుతున్నారు. జగద్గిరిగుట్ట, బచ్చుపల్లి, భిక్కనూరు, దేవునిపల్లి, రాజంపేట, మాచారెడ్డి, కామారెడ్డి, పోచారం, ఐటీ కారిడార్, ఘట్‌కేసర్, యాదాద్రి భువనగిరి, జనగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 నేరాలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లను అజంపురాకు చెందిన షేక్ ముజాహిద్, కల్కినగర్‌కు చెందిన ఆసం రాజేందర్‌కు విక్రయించేవారు. వీరిద్దరూ కామారెడ్డికి చెందిన సమీర్, శివ సహాయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి దొంగిలించిన మొబైల్ ఫోన్లను అన్‌లాక్ చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
భారీగా సొత్తు స్వాధీనం
నిందితుల నుంచి 6 మోటార్ సైకిళ్లు, 23 మొబైల్ ఫోన్లు, 2 డెస్క్‌టాప్ కంప్యూటర్లతోపాటు 95 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తక్కువ సమయంలోనే ఛేదించి సొత్తును స్వాధీనం చేసుకున్న కామారెడ్డి సీసీఎస్, పట్టణ పోలీస్ బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, పట్టణ సీఐ నరహరి తదితరులున్నారు.


