చెరువులో పడి ఒకరు మృతి
నవీపేట : మండలంలోని నాగేపూర్ శివారులోని చెరువులో పడి అదే గ్రామానికి చెందిన దేవరి నడిపి మోనన్న (55) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోనన్న భార్య లక్ష్మి 30 ఏళ్ల కిందట మృతి చెందడంతో శోభను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు చింటూ ఐదేళ్ల కిందట మృతి చెందడంతోపాటు రెండో భార్య అనారోగ్యానికి గురై మోనన్నకు దూరంగా ఉంటుంది. కుమార్తె మౌనిక కూడా కొద్ది రోజులుగా దూరంగా ఉంటుండటంతో జీవితంపై విరక్తితో మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 16న చెరువు కట్టపై మద్యం సేవిస్తూ కనపడిన మోనన్న.. మరుసటి రోజు చెరువులో శవమై కనిపించాడు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి సోదరుడు నడిపొల్ల శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
● వృద్ధురాలి బంగారు గుండ్లు అపహరణ
నవీపేట : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు గుండ్లను దుండగులు అపహరించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన వృద్ధురాలు విజయ నవీపేటకు మంగళవారం వచ్చింది. తిరిగి బుధవారం ఇంటికి వెళ్లేందుకు నిజామాబాద్ బస్సు ఎక్కే క్రమంలో తోపులాట జరిగింది. రద్దీ నుంచి సీట్‌లో కూర్చున్నాక.. వృద్ధురాలి బంగారు గుండ్లు అపహరణకు గురైనట్లు గుర్తించింది. ఈ విషయమై ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం
పెద్దకొడప్‌గల్(జుక్కల్) : మండల కేంద్ర శివారులోని 161 సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌ను అపహరించినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హైవే సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు.


