మాచారెడ్డి: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ గుణాత్మక విద్యను అందించాలని డీఈవో మల్లికార్జున్ సూచించారు. బుధవారం పాల్వంచ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన మరుగు దొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. హెచ్‌ఎం గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఏఎస్‌వో రమణ రావ్, ఎంఈవో రామ్ మనోహర్ రావ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): యాప్ లేకుండా రైతులకు యూరియాను పాత పద్ధతిలో సరఫరా చేయాలని తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాడ్వాయి సింగిల్ విండో కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. యాప్ వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ యాప్ వల్ల ఎరువుల కన్నా అధికంగా ట్రాన్స్‌పోర్టు చార్జీలు అధికంగా అవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యాప్‌ను రద్దుచేసి పాతపద్ధతిలో యూరియా ఎరువులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


