మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ పార్టీలో ఎవరు చేరతారు అన్న అంశంపై కేంద్రీకృతమై ఉంది. అయితే తెలంగాణ జాగృతిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్ గౌడ్ మినహా ముఖ్య నేతలు ఎవరూ ఆమె వెంట వెళ్లడం లేదని తెలుస్తోంది. సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించే సభలో పార్టీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లానుంచి ఎంతమంది ఆమె పార్టీలో చేరతారన్న అంశంపై చర్చ జరుగుతోంది. జిల్లాలో తెలంగాణ జాగృతికి నాయకత్వం వహిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్‌గౌడ్ ఆ సంస్థ అధ్యక్షురాలు కవిత వెన్నంటి నిలిచారు. ఆయన కొంత కాలంగా జాగృతిలో చురుకుగా పనిచేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన సంపత్‌గౌడ్.. ఆయా మండలాల్లో జాగృతి కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను బలోపేతం చేశారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయనకు కొత్త పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొత్త పార్టీలోకి సంపత్‌తోపాటు ఎవరెవరు వెళ్తారన్న అంశంపై చర్చలు సాగుతున్నాయి. కామారెడ్డి నియోజక వర్గంలో జాగృతిలో కొద్ది మంది పనిచేస్తున్నారు. ఇప్పటి వరకై తే పార్టీలో ఎవరూ చేరడం లేదని తెలుస్తోంది. జుక్కల్ నియోజకవర్గంలో రాజశేఖర్ జాగృతిలో చురుకుగా ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఒకరిద్దరు నాయకులు పనిచేస్తున్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంనుంచే ఎక్కువ..
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు జిల్లా నుంచి జనాన్ని తరలించేందుకు సంపత్‌గౌడ్ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది తరలివెళ్లే అవకాశాలున్నాయి. కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలించేందుకు జాగృతి కార్యకర్తలకు వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీలో ఎవరు చేరతారన్న అంశంపై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే జిల్లాలో గుర్తింపు ఉన్న నాయకులు ఎవరైనా కవిత పార్టీలో చేరతారా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.
నేడు హైదరాబాద్‌లో
పార్టీ ఆవిర్భావ సభ
‘జాగృతి’లో చురుగ్గా
ఒకరిద్దరు నేతలు..
క్రియాశీలకంగా పనిచేస్తున్న
గ్రంథాలయ సంస్థ
మాజీ చైర్మన్ సంపత్ గౌడ్
ఆయన ఆధ్వర్యంలో
జన సమీకరణకు ఏర్పాట్లు


