
హస్తం.. కొత్తోళ్లకే నేస్తం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమయ్యింది. సుమారు పదేళ్లపాటు బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. అయితే అధికారంలో లేకపోయినా పలువురు నేతలు పార్టీ జెండాను పట్టుకుని ఉన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో వేధింపులను తట్టుకుని నిలిచారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో తమ కష్టాలు తీరినట్లేనని భావించారు. పదవులు దక్కుతాయని ఆశించారు. అయితే చాలామంది ఆశలు అడియాసలయ్యాయి. పార్టీ అధికారంలోకి రాగానే వలసలు మొదలయ్యాయి. అప్పటివరకు ఎవరికి వ్యతిరేకంగానైతే పోరాడారో.. వారినే పార్టీలో చేర్చుకోవడంతో పాత నేతలు ఇబ్బందిపడుతున్నారు. గతంలో తమను ఇబ్బందిపెట్టినవారికే పార్టీలో, పదవులలో అందలం దక్కుతోందన్న భావనతో వారిలో అభద్రత భావం నెలకొంటోంది. దీనిపై ఇటీవల తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లగక్కుతున్నారు. ఓ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్‌గా ‘గెలిచాక నీతో నడిచేవాళ్లకంటే గెలుపు కోసం వెంట నడిచిన వాళ్లను గుర్తుపెట్టుకోండి’ అని పెట్టుకోగా.. దాన్ని చాలా మంది లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా తమ ఆవేదనను బయటపెట్టుకున్నారు. ‘అధికారంలోకి వచ్చాం కదా అని నిజమైన కార్యకర్తలను వదులుకుంటే అధికారం లేనపుడు పోరాడటానికి ఎవరూ ఉండరు, గెలిచాక వచ్చిన వాళ్లు పార్టీ ఓడిపోతే కనిపించరు’ అనే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ‘కార్యకర్తలకు ఇవ్వరు. వాళ్ల చుట్టాలకు, వాళ్ల దగ్గరి వాళ్లు, వాళ్ల బర్త్‌డేలు, పెళ్లి రోజులకు ఖర్చు పెట్టేవాళ్లకే పదవులు ఇస్తారు, పనిచేసి పెడతారు. కార్యకర్తలకు ఏదీ ఇవ్వరు. పార్టీలు మార్చినోళ్లకు అధిక గౌరవం ఉంది కాంగ్రెస్‌లో. ఇది ఊరూరా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి’ అంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆయా పోస్టులను మిగిలిన కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. అసలైన వారిని పట్టించుకోవాలని, అవసరం కోసం వచ్చిన వారిని వదిలేయాలని కోరుతున్నారు.
పాత శ్రేణుల్లో పెరుగుతున్న
అభద్రత భావం
ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే
ప్రాధాన్యత.. కష్టపడినోళ్లకు
గుర్తింపులేదని నైరాశ్యం
సోషల్ మీడియా వేదికగా ఆవేదనను
పంచుకుంటున్న నేతలు, కార్యకర్తలు

హస్తం.. కొత్తోళ్లకే నేస్తం!

హస్తం.. కొత్తోళ్లకే నేస్తం!