
క్రైం కార్నర్
కుక్కల దాడిలో మేకల మృతి
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందాయి. నందిపేటకు చెందిన ఎస్‌కే. అజీం తన ఇంటి ఎదుట రెండు మేకలను కట్టేసి ఉంచాడు. కాగా, ఒక్కసారి గుంపులుగా వచ్చిన కుక్కలు దాడి చేసి రెండు మేకల గొంతులను పట్టేసాయి. మేకల అరుపులు విని కుక్కలను తరిమివేసే ప్రయత్నం చేసినా కుక్కలు మేకలను విడిచి పెట్టకుండా వాటి తల, మొండెం భాగాలను వేరు చేశాయి.
ఎల్లారెడ్డిరూరల్: రేసు కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో 9 గొర్రెలు, ఒక మేక మృతి చెందినట్లు బాధితుడు రవి తెలిపారు. మండలంలోని తిమ్మారెడ్డి కట్టకింది తండాకు చెందిన రవి గొర్రెల మందపై రేసు కుక్కలు దాడి చేశాయి. ఘటనా స్థలాన్ని బీట్ ఆఫీసర్ మౌనిక పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరారు.
మెండోరాలో భారీ చోరీ
● ఆరు తులాల బంగారం అపహరణ
బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేర రామకృష్ణ దంపతులు మెండోరా మండల కేంద్రంలో కిరాణాషాపును నిర్వహిస్తారు. రోజూ ఇంటికి తాళం వేసి వచ్చి షాపులో ఉంటారు. పట్టపగలు గుర్తుతెలియని దుండగులు తాళం పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం పాఠఽశాల నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తాళం పగుల గొట్టి ఉండడాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసేలోపు భారీ చోరీ జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సుహాసిని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్