కరకట్టే పరిష్కారం!
దశాబ్దాల కాలంగా మంజీర తీరంలో ముంపు సమస్యను రైతాంగం ఎదుర్కొంటోంది. నదికి వరద పోటెత్తినపుడల్లా పరీవాహక ప్రాంతంలో వేలాది ఎకరాల పంటలు నీట మునుగుతున్నాయి. ప్రధానంగా జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మహ్మద్‌నగర్, పిట్లం, బిచ్కుంద తదితర మండలాలను ముంపు సమస్య వెన్నాడుతోంది. ఎగువన భారీ వర్షాలు కురిసి సింగూరు గేట్లు ఎత్తినపుడు, అలాగే పోచారం ప్రాజెక్టు పొంగినపుడు మంజీరలో వరద పోటెత్తి పరీవాహక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. గత నెల 26, 27, 28 తేదీలలో కురిసిన భారీ వర్షంతో పోచారం ప్రాజెక్టు ఎన్నడూ లేనంతగా పొంగింది. ప్రాజెక్టు కట్టపై నుంచి నీరు వెళ్లి కట్ట కోతకు గురవగా.. ఓ దశలో ప్రాజెక్టు కొట్టుకుపోతుందనే ఆందోళన వ్యక్తమైంది. గతంలో ఎన్నడూ రానంత వరద రావడంతో మంజీర పరవళ్లు తొక్కింది. దీంతో నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల, మాల్తుమ్మెద, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, మాసన్‌పల్లి, ఆత్మకూర్, జలాల్‌పూర్ గ్రామాలతో పాటు ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలకు చెందిన పంట చేలు నీట మునిగాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా, ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండడం, నిజాంసాగర్ ప్రాజెక్టు వెనుకభాగంలో నీరు తన్నడంతో ఆయా గ్రామాల పరిధిలోకి నీరు చొచ్చుకువచ్చింది. పొలాలు నీటమునిగాయి. తరువాత సింగూరు గేట్లు ఎత్తడంతో దాదాపు పది రోజుల పాటు నీరంతా చేలల్లోనే నిలిచిపోయింది. దాదాపు ఇరవై రోజులుగా పొలాలు ముంపులోనే ఉన్నాయి. మధ్యలో ఒకటి రెండు రోజులు కొంత బయటపడినా.. తిరిగి నీరు రావడంతో మునిగిపోయి పంట పాడైంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న నిజాంసాగర్, మహ్మద్‌నగర్, పిట్లం, బిచ్కుంద మండలాల్లో కూడా ముంపు సమస్య వేధిస్తోంది. అలాగే నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌తోనూ కొన్ని గ్రామాల్లో పంటలు మునిగిపోతున్నాయి. గేట్లు ఎత్తి దిగువకు వదిలినప్పటికీ ఎగువ నుంచి భారీ ప్రవాహం రావడం వల్ల నీరంతా వెనక్కి తన్నుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. దానికి తోడు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేసిన. దాదాపు రూ.3 లక్షలు ఖర్చు చేసిన. ఇటీవల వర్షాలతో మంజీర నది ఉప్పొంగి ప్రవహించడంతో పంటంతా నీట మునిగి కుళ్లిపోయింది. ఏటా ఇబ్బందులు పడుతున్నాం. ముంపు సమస్యను పరిష్కరించాలి.
– పరిశోధన్‌రెడ్డి, వెంకంపల్లి, నాగిరెడ్డిపేట మండలం
నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో మా ఊరిలో చాలా మంది పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈసారి పదిహేను రోజులుగా నీటిలోనే పంట ఉండడంతో దెబ్బతిన్నది. నాది ఎకరం పొలం పాడైంది. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
– బోడ జాను, రైతు, రుద్రారం, ఎల్లారెడ్డి మండలం
మూడు ఎకరాల్లో వరి పంట వేసిన. మంజీర వరద ఎక్కువగా వచ్చి పొలమంతా మునిగింది. వారం రోజులకు నీరు పోయిందనుకునేలోపు మరోసారి సింగూరు నుంచి నీరు వదలడంతో మళ్లీ మునిగింది. దీంతో పంట మొత్తం కుళ్లిపోయి నాశనమైంది. పెట్టిన పెట్టుబడి మొత్తం మునగాల్సి వచ్చింది.
– నగేశ్, రైతు, నాగిరెడ్డిపేట
మంజీర ప్రవాహం ఎక్కువగా ఉన్నపుడల్లా నీరంతా ఇరువైపులా ముంచెత్తుతోంది. చాలాచోట్ల పొలాల్లోకి వరద నీరు చేరి పంటను ముంచేస్తోంది. కొన్నిచోట్ల నీరు ఊళ్లను కూడా చుట్టేస్తోంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మంజీరకు ఇరువైపులా అక్కడక్కడ కరకట్ట లు నిర్మించాలని రైతులు సూచిస్తున్నారు. మంజీర వరద ఎక్కువగా వచ్చినపుడు వెనక్కి తన్ని నీటి ప్రవాహం కిలోమీటర్ల మేర నిలుస్తోంది. నాగిరెడ్డిపేట మండలం బంజర సమీపంలో జాతీయ రహదారినీ తాకుతోంది. అక్కడికి మంజీర చాలా దూరంలో ఉంటుంది. మంజీరకు కరకట్టలు నిర్మించి ఇబ్బందులు తొలగించాలని రైతులు వేడుకుంటున్నారు.
నాగిరెడ్డిపేట మండలంలో 12 గ్రామాల పరిధిలో దాదాపు మూడు వేల ఎకరాల్లో పంటలు మంజీరలో మునుగుతాయి. అలాగే ఎల్లారెడ్డి, పిట్లం, మహ్మద్‌నగర్, నిజాంసాగర్, బిచ్కుంద మండలాల పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నట్లు అంచనా. మొత్తంగా ఐదు వేల ఎకరాలకుపైగా పొలాలు మంజీర ప్రవాహంలో మునుగుతున్నాయని స్పష్టమవుతోంది. నాలుగైదు రోజులు నీరు నిలిస్తే పెద్దగా నష్టం ఉండదని, కానీ పక్షం రోజులపైనే నీరు నిలుస్తుండడంతో పంటంతా మురిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా భారీ వరదలతో
నీట మునుగుతున్న వేలాది ఎకరాలు
రోజుల తరబడి నీరు నిలుస్తుండడంతో
దెబ్బతింటున్న పంటలు
నష్టపోతున్న రైతులు
నదికిరువైపులా కరకట్టలు
నిర్మించాలంటున్న అన్నదాతలు
మంజీర ముంచేస్తోంది!
మంజీర ముంచేస్తోంది!
మంజీర ముంచేస్తోంది!