
ఇసుక మేటల తొలగింపును వేగవంతం చేయాలి
జాగ్రత్తలు పాటించాలి
● వరద ప్రభావిత వ్యవసాయ
భూములను సాగుకు
యోగ్యంగా మారుస్తాం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
లింగంపేట(ఎల్లారెడ్డి): భారీ వర్షాల కారణంగా వ్యవసాయ భూముల్లో ఏర్పడిన ఇసుక మేటలను తొలగించి తిరిగి సాగుకు యోగ్యంగా మారుస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. లింగంపేట మండలం బూరుగిద్ద శివారులో ఊరకుంట తెగిపోవడంతో పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. వరద బాధిత రైతులైన సబావత్ లక్ష్మి, చంద్రకళ, స్వరూప, మానస, పోచయ్య, బాలకిషన్‌తోపాటు అధికారులతో మాట్లాడారు. ఇసుక మేటలను వేగంగా తొలగింపజేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ కూలీలతో ఇసుక మేటలు, మొరం దిబ్బలు తొలగించి భూములను తిరిగి సాగు యోగ్యంగా మార్చాలన్నారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 287 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో ఇసుక మేటల కొలతలు తీసి పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇసుక మేటల నుంచి వచ్చిన ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు, ప్రభుత్వ నిర్మాణాలకు ఉపయోగించాలని ఎంపీడీవో నరేశ్‌కు, ఇసుక మేటల తొలగింపును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని డీఆర్డీవో సురేందర్‌కు సూచించారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ఇసుక మేటలు ఏర్పడకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. పంట నష్టం వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని వ్యవసాయాధికారులకు సూచించారు.
యుద్ధప్రాతిపదికన చెరువులకు మరమ్మతులు
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తెగిపోయిన చెరువుల కట్టలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు లు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తెగిపోయిన ఊరకుంట, సోమ్లానాయక్ చెరువు, కొండెంగల చెరువు, మల్లారం పెద్ద చెరువుతోపాటు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రతి రోజు ఇరిగేషన్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, ఇరిగేషన్, జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు ఉన్నారు.
కామారెడ్డి క్రైం: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని నీటి వనరులు పూర్తిస్థాయిలో నిండి ఉన్నాయని, చిన్న వర్షం కురిసినా లోలెవల్ కల్వర్టులు, బ్రిడ్జీలపైనుంచి వర్షం నీరు ప్రవహిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఈ విషయమై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈత కొట్టడానికి, చేపలు పట్టడానికి నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలు ప్రమాదకరమైన నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎత్తయిన టవర్లు, విద్యుత్ స్తంభాలు, చెట్ల కిందికి వెళ్లవద్దని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలని, బహిరంగ ప్రదేశంలో ఉంటే తక్కువ ఎత్తులో నేలపై వంగి కూర్చోవాలని సూచించారు.