
తాగునీటి తిప్పలు
పనులకు వెళ్లలేకపోతున్నాం
సమయానికి పంపలేకపోతున్నాం
● కంబాపూర్ గ్రామస్తులకు
వ్యవసాయ బోరుబావులే దిక్కు
● సమస్య గురించి పట్టించుకోని
అధికారులు
పిట్లం(జుక్కల్): కొన్ని రోజులుగా కంబాపూర్ గ్రామస్తులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామం మొత్తానికి రెండు సింగిల్ ఫేజ్ మోటార్లున్నాయి. కాని ఆ నీళ్లు అన్ని ఇళ్లకు సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు మంచిగా రావడం లేదు. అవి కూడా 2 బిందెల కంటే ఎక్కువ రాకపోవడంతో గ్రామంలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. గత నెల నుంచి గ్రామంలో నీటి సమస్య తీవ్రమైంది. పలు మార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. చేసేదేమీ లేక గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. పొలం గట్ల మీద నడుచుకుంటూ తెచ్చుకుంటున్నామని, పలుమార్లు జారిపడి దెబ్బలు తగులుతున్నాయని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది దూర ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామంలో నీటి సమస్య వల్ల కూలి పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
గ్రామంలో గత నెల నుంచి నీటి సమస్య తీవ్రమైంది. నీటిని పొలాల నుంచి తెచ్చుకుంటున్నాం. నీళ్లు లేక పనులకు కూడా వెళ్లలేకపోతున్నాం. గ్రామం నుంచి వ్యవసాయ భూమికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – కృష్ణ, కంబాపూర్
గ్రామంలో నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వ్యవసాయ బోరు బావుల నుంచి పిల్లలు, మేము కలిసి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఈ సమస్య వల్ల పిల్లలను పాఠశాలలకు సమయానికి పంపలేక పోతున్నాం. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – సాయగౌడ్, కంబాపూర్

తాగునీటి తిప్పలు

తాగునీటి తిప్పలు

తాగునీటి తిప్పలు