
కరుణ వర్షం కురిసేనా?
ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి
జిల్లాలో గతనెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరదలు, వర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 118 పశువులు చనిపోగా, 53,270 కోళ్లు మృత్యువాతపడ్డాయి. చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చెరువులు, కుంటలే కాదు ప్రాజెక్టులూ ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి. ఇళ్లు నీట మునిగి సర్వస్వం కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 1,454 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. విద్యుత్ శాఖకు సంబంధించి 38 గ్రామాల్లో 864 పోల్స్, 51.84 కిలోమీటర్ల మేర వైర్లు, 589 విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వరదలతో జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, ప్రాజెక్టులకు తాత్కాలిక మరమ్మతులు చేయించడానికి రూ.38.68 కోట్లు, పూర్తి స్థాయి పనులకు రూ.212.68 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
50 వేల ఎకరాలలో పంట నష్టం..
వరదలతో పొలాలు నీటమునిగి పంటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. ఇసుక మేటలు వేయడంతో మరింత నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 334 గ్రామాల్లో 37,313 మంది రైతులకు సంబంధించి 50,028 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరో 140 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. అయితే అంతకు రెట్టింపు విస్తీర్ణంలో పంటలు నాశనమయ్యాయని రైతులు పేర్కొంటున్నారు.
నీటిపారుదల రంగానికి రూ. 41 కోట్లు...
వర్షాలతో పోచారం ప్రాజెక్టు, కల్యాణి ప్రాజెక్టు, సింగీతం రిజర్వాయర్లతో పాటు 157 చెరువులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టు ఒక దశలో కొట్టుకుపోతుందనే ఆందోళన వ్యక్తమైంది. వందేళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు స్ట్రక్చర్ గట్టిగా ఉండడంతో అంత పెద్ద వరదను తట్టుకుని నిలబడింది. కట్ట కొంత కోతకు గురవగా తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. కల్యాణి వాగు ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్ల కట్టలు కొట్టుకుపోయాయి. వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంది. చెరువులకు చాలాచోట్ల గండ్లు పడ్డాయి. కాలువలు కూడా కొట్టుకుపోయాయి. వాటికి తాత్కాలిక మరమ్మతులకు రూ.5 కోట్లు వెచ్చిస్తుండగా.. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.36 కోట్లు అవసరమని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేశారు.
పంచాయతీరాజ్ శాఖ అంచనాలు..
కామారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలో 122 రోడ్లు, కల్వర్టులు దెబ్బతినగా వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.8 కోట్లు అవసరం అవుతాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. పూర్తి స్థాయిలో మరమ్మతులకు రూ.37.50 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేశారు.
కామారెడ్డి క్రైం: జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం ఆయన ఎస్పీ రాజేశ్ చంద్రతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్న జిల్లాలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. పట్టణంలోని జీఆర్ కాలనీలో పర్యటించి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో జరిగే వరదలపై సమీక్ష, ఫొటో ఎగ్జిబిషన్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)కు సంబంధించి 65 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నాయి. 48 కల్వర్టులు పాడయ్యాయి. చాలాచోట్ల రోడ్లు, కల్వర్టులు దెబ్బతినిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద ఉన్న కల్వర్టు వరదలో కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. అధికారులు కష్టపడి తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ రాకపోకలకు ఇబ్బందిగానే ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి దీనిని పరిశీలించనున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతినడంతో రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లు, కల్వర్టుల తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5.50 కోట్లు, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.120 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు.
భారీ వర్షాలు, వరదలతో
అతలాకుతలమైన జిల్లా
రూ. వందల కోట్ల మేర నష్టం
నేడు జిల్లాలో పర్యటించనున్న
సీఎం రేవంత్‌రెడ్డి
ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ
ఇవ్వాలంటున్న జిల్లావాసులు

కరుణ వర్షం కురిసేనా?

కరుణ వర్షం కురిసేనా?