
తీరని యూరియా కష్టాలు
● వరుసలో ఉన్నా దొరకని పరిస్థితి
● సొసైటీల వద్ద జాగారం చేస్తున్న రైతులు
● ఎవరికీ పట్టని రైతుల గోడు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అవసరమైన సమయంలో యూరియా కొరత రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎరువుల కోసం బారులు తీరుతున్న రైతులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ముందు రోజు రాత్రి నుంచే సొసైటీల వద్దకు చేరుకుని అక్కడే జాగారం చేస్తున్నారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లైన్లు కనపడుతున్నాయి. ముందుగా వచ్చి వరుసలో నిల్చున్న వారికి ఎరువుల బస్తాలు దొరుకుతుండగా, వెనకాల ఉన్న వారు ఆఖరుకు స్టాక్ అయిపోయిందనడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. శుక్రవారం ఎల్లారెడ్డిలో యూరియా కోసం రైతులు పొద్దున్నుంచే వరుస కట్టారు. పాసుపుస్తకాలను వరుసలో పెట్టారు. బుధవారం మహ్మద్‌నగర్ మండల కేంద్రంలో, అలాగే రాజంపేట మండలం తలమడ్లలో యూరియా కోసం రైతులు వరుసకట్టారు. రామారెడ్డిలో అయితే రాత్రి రైతు వేదిక వద్ద జాగారం చేశారు. వారం రోజులుగా రాజంపేట, మాచారెడ్డి, తాడ్వాయి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట తదితర మండలాల్లో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. జిల్లాలో 5.09 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి, మక్క, సోయా, పత్తి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే మక్కకు యూరియా అధిక మోతాదులో వాడుతున్నారు. దీంతో యూరియా అవసరం పెరిగింది. అవసరానికి తగ్గట్టుగా యూరి యా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. యూరియా సరఫరా విషయంలో అధికారుల మధ్యన సమన్వయం అవసరమని పేర్కొన్నారు. గ్రామాల వారీగా యూరియాను సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.