
నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
● 300 మందితో పటిష్ట బందోబస్తు
● 120 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా
● ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి క్రైం : కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా, సురక్షితంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో శోభాయాత్ర జరిగే మార్గాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక ప్రతిమలు వెళ్లే దారి వెంబడి 300 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు. 120 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు అధికారులకు సూచించారు. రూట్ మ్యాప్ ప్రకారం శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా చూడాలన్నారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా బారికేడింగ్, ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగే ఘటనలకు చోటు లేకుండా సమన్వయంతో, సహనంతో పనిచేయాలని సూచించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, నిమజ్జన ఘాట్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అదనపు బందోబస్తు అమలు చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ నర్సింహా రెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.