
రేవంతన్నా.. ఉద్యోగం రాలేదన్నా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : లింగంపేట మండలం నల్లమడుగు గ్రామంలో నాలుగేళ్ల క్రితం వడ్ల కుప్పకాడ కావలిగా ఉన్న మెట్టు ప్రభాకర్ (28) అనే రైతు పాము కాటుతో చనిపోయాడు. అప్పట్లో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. రూ.లక్ష సాయం అందించారు. అక్కడి నుంచే ఆర్డీవోకు ఫోన్ చేసి పదో తరగతి చదివిన ప్రభాకర్ భార్య ప్రసన్నకు అంగన్‌వాడి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. అధికారులు చూస్తామని మాటిచ్చి వదిలేశారు. అప్పడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. గురువారం లింగంపేట మండలానికి వస్తున్నారు. భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లలను పోషించడానికి ప్రసన్న ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తనకు భరోసా ఇస్తారని ఆమె ఆశిస్తోంది. ఏదైనా ఉపాధి, ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.