
రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్ : నలభై ఏళ్ల వయసు పైబడిన వారందరూ క్రమం తప్పకుండా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. జిల్లా ఆస్పత్రిలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు వైద్య పరీక్షల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడి అందరూ కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్య పరీక్షలతో ముందస్తుగా వ్యాధులను గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ఈ శిబిరంలో 86 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో శిథిలావస్థలో ఉన్న పాత బిల్డింగ్‌ను కలెక్టర్ పరిశీలించారు. భవనానికి మరమ్మతులు చేయించాలని సూచించారు. సదరం పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్ తదితరాలను సమకూర్చుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ పెరుగు వెంకటేశ్వర్లుకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, ఆర్‌ఎంవో శ్రీనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ స్వరూప, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి