
బ్లూకోల్ట్ విధుల్లో మహిళా కానిస్టేబుళ్లు
కామారెడ్డి క్రైం : మహిళా పోలీసులూ బ్లూకోల్ట్ విధుల్లో భాగమయ్యారు. మొదటి విడతలో ఐదు పోలీస్ స్టేషన్‌లను ఎంపిక చేసిన అధికారులు.. శుక్రవారం సేవలకు శ్రీకారం చుట్టారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణ నుంచి ఎస్పీ రాజేశ్ చంద్ర ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు బ్లూకోల్ట్ విధుల్లో పురుష కానిస్టేబుళ్లు మాత్రమే ఉండేవారన్నారు. తాజాగా మహిళా కానిస్టేబుళ్లూ ఇందులో భాగమవుతారన్నారు. మొదటి విడతలో భాగంగా కామారెడ్డి, దేవునిపల్లి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భిక్కనూరు పీఎస్‌లను ఎంపిక చేశామన్నారు. డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించాలని ివిధులకు ఎంపిక చేసిన సిబ్బందికి సూచించారు. స్వీయ రక్షణ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, సీఐలు నరహరి, సంతోష్ కుమార్, నవీన్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
మొదటి విడతలో 5 పీఎస్‌ల ఎంపిక
జెండా ఊపి సేవలను ప్రారంభించిన ఎస్పీ రాజేశ్ చంద్ర