
నాయకుడిని కాదు.. మీ సేవకుడిని
లింగంపేట: ‘‘నేను నాయకుడిని కాదు.. ప్రజా సేవకుడిని.. ఎవరికి కష్టం వచ్చినా తోడుగా ఉంటా’’ అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా లింగంపేటలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేకు నల్లమడుగు చౌరస్తా నుంచి లింగంపేట అంబేడ్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తాను ఎర్రాపహాడ్ ఉన్నత పాఠశాలలో చదువుకొన్నానని గుర్తు చేశారు. అమెరికా వెళ్లి వేల కోట్లు సంపాదించానని పేర్కొన్నారు. తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చానని పేర్కొన్నారు. పుట్టిన రోజున వందల కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద నాయకులు, పారిశ్రామికవేత్తలతో వేడుకలు చేసుకున్నా కానీ సంతృప్తి లేదన్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గ ప్రజలతో జరుపుకుంటున్న బర్త్‌డేతో సంతృప్తి పొందానన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేంత వరకు శ్రమిస్తునే ఉంటానన్నారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పట్టుపట్టి మంజూరు చేయించానన్నారు. తాను అభివృద్ధి ప్రదాతనే అని, నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. లింగంపేట మండలం నల్లమడుగు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జీవదాన్ స్కూల్, గ్రామ పంచాయతీ కార్యాలయం, మోహిన్ హమ్మద్ ఖాద్రీ రిసార్ట్‌లలో కేక్‌లు కట్ చేశారు. కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నారాగౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గోకుల్ సాయిరాం, రఫీయోద్దీన్, సంతోష్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి ఫతియోద్దీన్, మోహిద్, వాహబ్, ఇబ్రహీం, అశోక్, విఠల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా..
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు