
కలెక్టర్ నిధుల మంజూరుతో పనుల ప్రారంభం
మద్నూర్(జుక్కల్): మండలంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద గల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం పలు శాఖల అధికారులు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురుకుల పాఠశాలను సందర్శించిన సమయంలో పాఠశాలలో సమస్యలున్నాయని కలెక్టర్ దృష్టికి విద్యార్థినులు వివరించగా వెంటనే స్పందించి రూ. 2 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. పాఠశాలలో చేపట్టాల్సిన పనులు ప్రారంభించడానికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాలతో మండల తహసీల్దార్ ముజీబ్, పంచాయతీరాజ్‌శాఖ ఏఈఈ, విద్యుత్ శాఖ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈలు, ఇతర శాఖల అధికారులు పనుల కోసం ప్రణాళికలు తయారు చేశారు. హాస్టల్ మెస్ వరకు విద్యుత్ స్తంబాల ఏర్పాటు, తాగునీరు కోసం బోరుబావి, హస్టల్ భద్రత సిబ్బంది కోసం గది నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ముజీబ్ తెలిపారు. దీంతో గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.