
స్నేహం వయసు ఆరు పదులు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఊహ తెలియని వయసులోనే వారు స్నేహితులయ్యారు. బడిలో చేరినప్పుడు దోస్తులైనవారు.. తాతలుగా మారాకా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆరు పదులు దాటాకా నవ యువకుల్లా నవ సమాజం గురించి ఆలోచనలు చేస్తూ తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్లు కె.శ్యాంరావు, అయాచితం శ్రీధర్, రిటైర్డ్ హెచ్‌ఎంలు కె.వేణుగోపాల్, వీఆర్ శర్మ, ప్రముఖ న్యాయవాది జి.జగన్నాథం, రిటైర్డ్ ఆర్‌అండ్‌బీ ఉద్యోగి మధుసూదన్, జర్నలిస్టులుగా పనిచేసిన ఎ.దయానంద్, కె.రాములు, రిటైర్డ్ టీచర్లు మారుతి, కే.రమణ, డి.నారాయణ.. వీళ్లంతా చెడ్డీ దోస్తులు. ఉద్యోగాలు చేసి విరమణపొందారు. ఇందులో దయానంద్, రమణ ఇటీవల చనిపోయారు. విద్యార్థి దశలోనే వీరంతా సామాజిక స్పృహను ఒంటబట్టించుకుని సమాజం కోసం పనిచేయసాగారు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సమాజాన్ని జాగృతం చేయడానికి ప్రయత్నించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహించారు. సిటిజెన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలోనూ గుర్తింపు పొందారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా కే.వేణుగోపాల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మాది మనీ సంబంధం కాదని, మానవీయత ఉన్న బంధమని పేర్కొన్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఒకరికొకరం అండగా నిలుస్తున్నామన్నారు.