
పగలు రెక్కీ.. రాత్రి దోపిడీ!
● ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
● రూ. 16 లక్షల విలువైన
సొత్తు స్వాఽధీనం
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం : పగలు ఐస్ క్రీంలు అమ్ముతూ రెక్కీ నిర్వహిస్తూ రాత్రి సమయాల్లో దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పపడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.16 లక్షల సొత్తును రికవరీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం మీడియాకు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జూలై 25న రాత్రి సమయంలో భిక్కనూరు మండలం అంతంపల్లి శివారులో ఉన్న ఓ రెడీమిక్స్ ప్లాంట్‌లోకి దుండగులు చొరబడి ఇద్దరు వాచ్‌మన్‌లను బెదిరించి సెల్‌ఫోన్‌లు, సెంట్రింగ్ రాడ్‌లను దోచుకెళ్లారు. 27న రాజంపేట మండలం తలమడ్ల శివారులో ఉన్న ఓ ఫార్మా కంపనీలోకి రాత్రి సమయంలో చొరబడిన దుండగులు.. మందులు తయారు చేసే రూ.15 లక్షల విలువైన యంత్ర పరికరాలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి ఆయా పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలతో నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన తానే అలీ, బిర్దేష్ అలీ, సల్మాన్, మహమ్మద్ సమీర్, చాంద్ బాబులుగా గుర్తించారు. వారు కొద్ది రోజులుగా కామారెడ్డిలోని ఆదర్శ్ నగర్, ఇందిరా నగర్ కాలనీల్లో నివాసం ఉంటూ ఐస్ క్రీం వ్యాపారం ముసుగులో చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. శనివారం భిక్కనూరు టోల్‌గేట్ వద్ద ఒకరిని, కామారెడ్డిలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఫార్మా కంపెనీకి చెందిన రూ.15 లక్షల విలువైన యంత్ర సామగ్రి, సెల్‌ఫోన్, సెంట్రింగ్ రాడ్లు, కాపర్ కేబుల్, 2 మోటార్లు, ఇతర సామగ్రిని రికవరీ చేశామన్నారు. నిందుతులు ఉపయోగించిన ఆటోలు, బైక్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెండు నేరాలతో పాటు నిందితులు కొద్ది రోజుల క్రితం మాచారెడ్డి మండలం పరిధిలో మరో నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.
హైద్రాబాద్‌లో రిసీవర్..
ఐస్ క్రీంలు అమ్ముకునే ముసుగులో నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన హసన్ ఖాన్ అనే వ్యక్తి రిసీవర్‌గా పని చేసినట్లు పోలీసులు గుర్తించా రు. అతడిని కూడా అరెస్ట్ చేశారు. నిందితులు పథకం ప్రకారమే దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతుంటారు. రెక్కీ సమయంలో అ నువుగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటారు. ఏ వస్తువును చోరీ చేసినా రవాణా చేయడానికి హ సన్ ఖాన్ వాహనాన్ని సిద్ధం చేసి ఉంచేవాడని ఎస్పీ తెలిపారు. ముషీరాబాద్ చేరగానే పార్టు లు విప్పేసి అమ్మేస్తారన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు సంపత్ కుమార్, రామన్, ఎస్సైలు శ్రీనివాస్, ఉస్మాన్, ఆంజనేయులు, అనిల్, ఏఎస్సై వెంకట్‌రావు, సిబ్బంది కిషన్, రాజవీరు, గణపతి, మైసయ్య, స్వామి, రాజేంద్ర కుమార్, రజినీకాంత్, కిషన్ గౌడ్, నరేష్, రవి, లక్ష్మీకాంత్, రాములును అభినందించారు.