
నష్టపరిహారం ఇప్పించాలి..
కామారెడ్డి క్రైం: ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ భూములు అంటూ అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని పెద్ద కొడప్‌గల్ మండలం కాటేపల్లి తండావాసులు అన్నారు. దాదాపు 20 మంది గురువారం జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయానికి తరలివచ్చారు. డీఎఫ్‌వో నిఖిత ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం జుక్కల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ సౌదాగర్ అరవింద్, గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇటీవల కాటేపల్లి తండా శివారులో అటవీ అధికారులు దాడులు నిర్వహించి గత 20 ఏళ్లకు పైగా తాము సాగు చేసుకుంటున్న భూముల్లో పంటలను జేసీబీలు, ట్రాక్టర్ లతో దున్నివేశారని తెలిపారు. దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్న కాలం నుంచి ఈ ప్రాంతం లోని దాదాపు 60 ఎకరాలకు పైగా భూమిని సాగు చేసుకుంటూ 30 కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. అధికారులు వచ్చి అటవీ భూములంటూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికే 20 ఎకరాల్లో వేసిన పంటలను చెడగొట్టారని పేర్కొన్నారు. దీంట్లో అనేక మంది నిరుపేద రైతులు ఉన్నారని అన్నారు. వేలల్లో పెట్టుబడులు పెట్టిన పంటలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను తిరిగి ఇవ్వాలని, కోల్పోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలనీ డీఎఫ్‌వోకు విన్నవించినట్లు తెలిపారు.
డీఎఫ్‌వో కార్యాలయానికి తరలివచ్చిన కాటేపల్లి వాసులు