● మేత ధరలు తగ్గించాలి
● మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్
కాకినాడ రూరల్: రొయ్యల మేత ధరలను తక్షణం పూర్తి స్థాయిలో తగ్గించి, ఆక్వా రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఫీడ్, సీడ్, ఎగుమతుల వరకూ కొంత మంది చేతిలో మాఫియాలా ఆక్వా రంగం మారిపోయిందని మండిపడ్డారు. ఫిబ్రవరిలో కేజీ మేతపై రూ.4, జూన్‌లో ఏకంగా రూ.10 పెంచారని, దీనిపై ఆక్వా రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. వారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, తమ గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. జూలైలోగా మేత రేట్లు తగ్గించకుంటే ఆందోళనకు దిగుతామని ఆ సందర్భంగా జగన్ అల్టిమేటమ్ ఇచ్చారన్నారు. కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే, ఆ కుటుంబంతో బేరాలాడుతున్నారని, ఇక్కడేమో రొయ్యల మేత కంపెనీలతో బేరాలాడి ధర కేజీకి కేవలం రూ.4 తగ్గించారని అన్నారు.
కిలోకు రూ.14 పెంచి ఆక్వా రైతులను నాశనం చేస్తున్నారని, పెంచిన ధరలు వెంటనే పూర్తి స్థాయిలో తగ్గించాలని, కేవలం రూ.4 తగ్గించామని, అదే ఘన విజయమని ప్రభుత్వం చెప్తే కుదరదని స్పష్టం చేశారు. ఆక్వా రంగం ప్రభుత్వ సహాయంతో ఎదిగిన పరిశ్రమ కాదని, దానిని కూడా బేరసారాలకు దింపేసి రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నింటికీ డైవర్షన్ పాలిటిక్సే
ప్రస్తుతం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ న్యూస్ మాత్రమే చూస్తున్నామని కన్నబాబు అన్నారు. చిన్న సమస్య వస్తేనే తల్లడిల్లిపోయే చంద్రబాబు మీడియా, వారి మద్దతుదారులు.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటన జరిగేసరికి రకరకాలుగా స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హోం మంత్రి మేకప్ గురించి ఏదో అన్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై విరుచుకు పడ్డారని, రికార్డులు తీస్తే చింతమనేని నుంచి బండారు సత్యనారాయణమూర్తి వరకూ అందరూ బయటకు రావడంతో ఆ విషయాన్ని వదిలేశారని అన్నారు. లాకప్ డెత్ గురించి మాట్లాడవల్సిన వారు పేకప్ గురించి మాట్లాడారన్నారు.
డీఎస్సీ అక్రమాలను వెలుగులోకి తెస్తే జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందుకు వచ్చి, తొడ కొడుతున్నానన్నట్టుగా లోకేష్ ప్రగల్భాలు పలికారన్నారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్‌తో చర్చకు సిద్ధమని తాను చెప్పి 24 గంటలు గడిచినా విద్యా శాఖ మంత్రిగా లోకేష్ ఎందుకు స్పందించలేదని కన్నబాబు ప్రశ్నించారు.


