● నేటి నుంచి ఓటర్ల జాబితా
ప్రత్యేక సమగ్ర సవరణ
● ఇప్పటికే ఓటర్ల మ్యాపింగ్ పూర్తి
● జిల్లాలో మ్యాపింగ్ కాని ఓట్లు 3,25,800
పిఠాపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సిఫైడ్ రివిజన్ – ఎస్‌ఐఆర్) ప్రక్రియ జిల్లాలో సోమవారం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓటు హక్కుకు సంబంధించి ఈ ప్రక్రియ ఎన్నో ఆరోపణలు, మరెన్నో సందేహాలు, సంచలనాలు రేపింది. లక్షలాదిగా ఓట్లు తొలగించారనే ఆరోపణలు అనేక రాష్ట్రాల్లో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న సర్‌పై ఓటర్లు, రాజకీయ పార్టీల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఆయా పార్టీల ప్రతిధులతో అధికారులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే తొలి దశ ఓటర్ల మ్యాపింగ్ పూర్తవగా.. జిల్లాలో మ్యాపింగ్ కాని ఓట్లు 3,25,800 ఉన్నాయి.
ఇదీ ప్రక్రియ
జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ బూత్‌ల పరిధిలో 16.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సర్ నిర్వహణ కోసం బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్‌ఓ) ఈ నెల 5 నుంచి శిక్షణ ఇచ్చారు. వీరు సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. అనంతరం, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.
ఓటర్లు సిద్ధం కావాలిలా..
చనిపోయిన, శాశ్వతంగా తరలిపోయిన, నకిలీ, అనర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే పేరుతో ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ నిర్వహిస్తోంది. సర్వేలో భాగంగా ఇంటికి వచ్చే బీఎల్‌ఓలు ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అందులో రెండు కాలమ్‌లు ఉంటాయి. మొదటి కాలమ్‌లో 2002 ఓటర్ల లిస్టు వివరాలు, పాత ఫొటో ఉంటాయి. దాని పక్కన కొత్త ఫొటో అతికించాల్సి ఉంటుంది. అందులోనే ఓటరు పేరు, ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) నంబరు ఉంటాయి. వీటితో పాటు ఆ ఫామ్‌లోని ఇతర వివరాలు పూర్తి చేయాలి. రెండో కాలంలో పుట్టిన తేదీ, మొబైల్, ఆధార్ నంబర్లు, ఇతర వివరాలు పూర్తి చేయాలి. ఇలా రెండు ఫామ్‌లు పూర్తి చేశాక బీఎల్‌ఓలు ఒకటి రసీదుగా ఓటరుకు ఇచ్చి, రెండోది తీసుకువెళ్తారు. కొత్త ఓటర్లు ఫామ్–6, డిక్లరేషన్‌లో కచ్చితమైన వివరాలు అందించాలి. ఈ వివరాల ధ్రువీకరణకు ప్రతి ఓటరును బీఎల్‌ఓలు మూడు దఫాలు కలుస్తారు.
ఇతర ప్రాంతాల్లో ఉంటే..!
ఎవరైనా ఏదైనా కారణంతో ఇతర ప్రాంతాల్లో నివాసముండవచ్చు. ఆ సమయంలో బీఎల్‌ఓలు ఇంటికి వచ్చినప్పుడు వారు అందుబాటులో లేకపోతే వలస వెళ్లిన వారిగా గుర్తిస్తారు. కానీ ఓటు మాత్రం తొలగించే అధికారం బీఎల్‌ఓలకు ఉండదు. స్వస్థలం వదిలి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్థానిక ఓటర్లకు చట్టపరంగా నోటీసు జారీ చేస్తారు. ఆ నోటీసుకు గడువు లోగా స్పందించి వివరాలు అందించాలి. లేకపోతే ఇక్కడి ఓటు రద్దవుతుంది. మొత్తమ్మీద సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉంటే ఎవ్వరి ఓటూ రద్దయ్యే చాన్స్ ఉండదని అధికారులు చెబుతున్నారు. అందువలన ఓటర్లందరూ అవసరమైన డాక్యుమెంట్లతో సర్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నారు.
ఒకటికి మించి ఓట్లు ఉంటే..!
ఏ ఓటరయినా దేశంలో ఒక్కచోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. రెండు మూడు చోట్ల ఓట్లు ఉంటే సాంకేతిక సమాచారం ద్వారా వాటిని తొలగిస్తున్నారు. రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు స్వయంగా ఒకచోట ఓటు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఓటు వద్దనుకుంటున్న ప్రాంతంలో ఫామ్–7 పూర్తి చేసి బీఎల్‌ఓకు అందజేయాలి.
నియోజకవర్గాల వారీగా జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్
నియోజకవర్గం మొత్తం మ్యాపింగ్ మ్యాపింగ్
ఓటర్లు అయినవి కానివి
తుని 2,26,071 1,94,000 32,071
ప్రత్తిపాడు 2,19,988 1,83,771 36,217
పిఠాపురం 2,40,773 2,11,678 29,095
కాకినాడ రూరల్ 2,71,318 1,89,861 8,1487
పెద్దాపురం 2,18,002 1,84,851 33,151
కాకినాడ సిటీ 2,42,514 1,62,881 79,633
జగ్గంపేట 2,32,145 1,97,969 34,176
మొత్తం 16,50,811 13,25,011 3,25,800


