రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కిర్లంపూడి: రోడ్డు దాటుతున్న వ్యక్తిని బొలెరో వ్యాన్ ఢీకొని, ఆపై రోడ్డు దాటేందుకు ఆగిఉన్న వ్యక్తిపై బోల్తా పడడంతో ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బూరుగుపూడి గ్రామానికి చెందిన పిన్నం లవకుశలు (74) వ్యవసాయ పనులు చేసుకుంటూ కొడుకులతో కలసి జీవిస్తున్నాడు. ఖాళీ సమయాల్లో స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ వద్ద పనిచేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వాటర్ ప్లాంట్ నుంచి ఇంటికి వెళ్లేందుకు లవకుశలు రోడ్డు దాడుతున్నాడు. ఈ సమయంలో యర్రవరం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు బెల్లం లోడుతో వెళుతున్న బొలెరో వ్యాన్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని అంబులెన్స్‌లో రాగంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందాడు. బూరుగుపూడి ఊరు శివారున ఉన్న పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టించుకునేందుకు మోటార్ సైకిల్‌పై రోడ్డు దాటేందుకు ఎదురు చూస్తున్న పెద్దాపురం మండలం చదలాడ గ్రామానికి చెందిన పల్లా భాస్కరరావు (44)పై ఆ వ్యాన్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భాస్కరరావు కుమారుడు పల్లా సునీల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు.
CLS
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి


