కండలు ప్రదర్శించి.. పతకాలు సాధించి..
● ఉత్సాహంగా బాడీ బిల్డింగ్ పోటీలు
● సుమారు 150 మంది బిల్లర్లు రాక
అమలాపురం టౌన్: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమలాపురంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ –2026 పోటీలు సోమవారం నిర్వహించారు. అమలాపురానికి చెందిన స్పోర్ట్స్ లెజెండ్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్ తండ్రి) పేరిట నిర్వహించిన ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 150 బాడీ బిల్డర్లు వచ్చి తమ కండలను ప్రదర్శించారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ప్రారంభించారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు అధ్యక్షతన జరిగిన పోటీల ప్రారంభ సభలో ఎంపీ మాట్లాడారు. దివంగత కాశీ విశ్వనాథం కుమారుడైన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్‌ను జిల్లా యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రధాన కార్యదర్శి, అమలాపురం హెల్త్ ఫిట్‌నెస్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు పోటీలను పర్యవేక్షించారు. మొత్తం 12 విభాగాల్లో జరిగిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కోచ్‌లు ఎం.పోలయ్య, బి.ప్రకాష్, బి.కృష్ణ, అహ్మద్ మోహిద్, వై.శ్రీనివాసరావు, ఎం.సముద్రం, ఎన్.క్రాంతి కుమార్ వ్యవహరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల పద్మరాజు, కోనసీమ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టైటిల్ విన్నర్‌గా గణేష్
ఉభయ గోదావరి జిల్లాల స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీల ఓవరాల్ చాంపియన్‌గా టైటిల్ విన్నర్ స్థానాన్ని పెద్దాపురానికి చెందిన బాడీ బిల్డర్ జి.గణేష్ గెలుచుకున్నారు. రన్నర్‌గా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పి.సాయిగణేష్ నిలిచారు. విజేతలకు షీల్డ్‌లు, పతకాలు, సర్టిఫికెట్లను బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు తదితరులు అందజేశారు.
కండలు ప్రదర్శించి.. పతకాలు సాధించి..


