
నీటి వనరుల సంరక్షణకు పటిష్ట చర్యలు
● జేసీ రాహుల్ మీనా
● వివిధ శాఖల అధికారులతో సమీక్ష
కాకినాడ సిటీ: జిల్లాలో కబ్జాకు గురైన వివిధ శాఖలకు చెందిన నీటి వనరుల ఆక్రమణలను తొలగించి జల వ్యవస్థల పటిష్టతకు సమష్టి చర్యలు చేపట్టాలని జేసీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాలులో చెరువులు, కాలువలు, డ్రైన్లు, వాగులు తదితర నీటి వనరుల సంరక్షణపై జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటి వనరుల ఆక్రమణలు, వాటివల్ల ఎదురయ్యే సమస్యల నివారణకు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. మే నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సూచనల మేరకు రికార్డుల ప్రకారం జిల్లాలో మొత్తం 21,185.95 ఎకరాల విస్తీర్ణంలో 2670 నీటి వనరులు ఉండగా 327 వనరులకు సంబంధించి 1,548 ఎకరాల విస్తీర్ణం ఆక్రమణకు గురైనట్లు గుర్తించగా, ఇప్పటి వరకూ 2.49 ఎకరాలలోని ఆక్రమణలను తొలగించామని, మిగిలిన వాటి తొలగింపులకు చర్యలను ముమ్మరం చేయాలని జేసీ ఆదేశించారు. సోమవారం నాటికి డివిజన్ స్థాయిలోను, 15వ తేదీలోపు డివిజన్ స్థాయిలో రక్షణ కమిటీల సమావేశాలు జరిపి సర్వే నిర్వహణకు షెడ్యూల్‌ను సమర్పించాలని ఆదేశించారు. రానున్న నెల రోజుల్లో సర్వేలు పూర్తి చేసి వాటి విస్తీర్ణం, హద్దులను, ఏ శాఖకు చెందినవో వివరాలు ప్రకటిస్తూ అన్ని వనరుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో జె.వెంకటరావు, డీపీవో వి.రవికుమార్, పెద్దాపురం ఆర్డీవో కె.శ్రీరమణి, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.