
బదిలీ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వండి
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్
అమలాపురం టౌన్: రాష్ట్రంలో ఇటీవల బదిలీ అయిన 60 వేల మంది ఉపాధ్యాయులకు రెండు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలాపురంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత జూన్ నెలలో సాధారణ బదిలీల్లో భాగంగా దాదాపు 67 వేల మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం జరిగిందన్నారు. కొందరు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెచ్‌ఎంలుగా, మరికొందరు ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చి హెచ్‌ఎంలుగా పంపించిందని గుర్తు చేశారు. స్కూల్ అసిస్టెంట్ సమాన క్యాడర్ బదిలీలు జూన్ 9తో, ఎస్జీటీల బదిలీలు జూన్ 14తో ముగిశాయన్నారు. మరుసటి రోజు అందరూ బదిలీల ప్రకారం కొత్త పాఠశాలలకు వెళ్లి బాధ్యతలు చేపట్టారని వివరించారు. కొందరు ఉన్న క్యాడర్లలోనే స్థానికంగా మారడంతో వారికి వేతనాలు అందాయన్నారు. కానీ పోస్టుతో సహా స్థానచలనం కలిగిన దాదాపు 60 వేల మంది ఉపాధ్యాయులకు జూన్, జూలై నెలలకు జీతాలు జమ కాలేదని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం రెండు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.