
భయో వ్యర్థాలు!
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
అంతా లాలూచీయేనా!
అనుమతులు లేని ల్యాబ్‌లు ఇష్టానుసారంగా జనాల్ని దోచేస్తుంటే, అధికారులకు చీమకుట్టినట్లు అయినా లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ తీరుపై ల్యాబ్ యాజమాన్య వర్గాల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అనధికార ల్యాబ్ నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖలో పలువురు సిబ్బంది అధికారుల నిర్వాకాన్ని బయటపెడుతున్నారు.
ప్రజలు జాగ్రత్త
అనుమతులు లేని ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుంటే పరీక్షల నివేదికల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. ధరలు, డిస్కౌంట్ల ఎరతో ప్రజల్ని ఆకర్షిస్తున్నారు. కాగా అనుమతులు ఉన్న ల్యాబ్‌లలో రోగి వివరాలు నమోదవుతాయి. అలాగే నివేదికల్లో అనుమానాలు ఉన్నా నేరుగా యంత్రం వద్దకు వెళ్లి సరిచూసుకోవచ్చు. ఈ సౌలభ్యం అనధికార ల్యాబ్‌ల వద్ద ఉండదు. శీతల వాతవారణం తగినంత లేకపోయినా ఉష్ణోగ్రత ఎక్కువైతే ఆ యంత్రం ఇచ్చే నివేదికల్లోనూ కచ్చితత్వం లోపించవచ్చు. కాబట్టి ప్రజలు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకునేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. తాము వెళ్లిన ల్యాబ్ అనుమతులు చూపించమని అడిగేందుకు ఎటువంటి మొహమాటం అవసరం లేదు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ల విద్యార్హతల పైనా ఆరా తీయాలి.
కాకినాడ క్రైం: జిల్లాలో వైద్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ల్యాబొరేటరీలలో కొన్ని ప్రజారోగ్యానికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. అనుమతులు తీసుకునేందుకు వెనకాడి జనం జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. రిజిస్ట్రేషన్ లేకపోతే చవక ధరల్లో ప్రమాదకర వ్యర్థాలైన బయో మెడికల్ వేస్టేజీ తొలగింపు సాధ్యం కాదు. నిర్ణీత ధరల కంటే రెండు రెట్ల ఎక్కువ ధరలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆయా ల్యాబ్‌ల యాజమాన్యాలు ప్రమాదకర కుయుక్తులకు తెరతీశాయి. ప్రాణాంతకాలుగా పరిణమించే బయో మెడికల్ వ్యర్థాలను డంప్ యార్డులు, రోడ్డు పక్కన, డ్రైనేజీలు, చెత్తకుప్పల్లోకి విసిరేసి తమకేమీ తెలియనట్లు చేతులు దులిపేసుకుంటున్నారు. అనఽధికారికంగా కొనసాగుతున్న ల్యాబ్‌ల తీరు ఇంత దారుణంగా ఉంటున్నా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని సంబంధిత అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ, డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఉన్న చెత్త కుండీలలోనే బయో మెడికల్ వ్యర్థాలు దర్శనమిస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
రిజిస్ట్రేషన్ చేయించుకుంటే
ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ల ఏర్పాటుకు ఓ నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. వాటికి ప్రభుత్వ అనుమతులు పొందాలి. అందుకు నిర్ణీత ప్రమాణాలు ఉంటేనే అనుమతులు వస్తాయి. సందుగొందుల్లో ఇరుకు గదుల్లో ల్యాబ్‌లు పెట్టేస్తామంటే కుదరదు. అలాగే రోగిని పరీక్షించి మీకు ఈ వ్యాధి ఉంది, స్థితిగతులివి అని నిర్థారించే వ్యక్తి కచ్చితంగా తగిన విద్యార్హుడై ఉండాలి. అటువంటి వారికి అర్హతకు తగిన జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించే బయోకెమిస్ట్రీ, హార్మోన్స్, హెమటాలజీ అనలైజర్ల వంటి పరికరాలు 25 డిగ్రీల ఉష్ణోగ్రత మించని వాతావరణం కల్పించాలి. నమోదైన ప్రతి ల్యాబ్ బయో మెడికల్ వ్యర్థాల తొలగింపునకు ప్రభుత్వ అనుమతులు పొంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలో సేవలందించే సంస్థకు ప్రతి నెల నిర్ణీత రూ.1680 మొత్తాన్ని చెల్లించి రోజువారీగా వాటిని అప్పగించాల్సి ఉంటుంది. ధర అందుబాటులోదే అయినా ఎంతో ఒకంత వ్యయంతో కూడిన ప్రక్రియ. ఆ మాత్రం ఖర్చుకై నా మనస్కరించని పలువురు ల్యాబ్ యజమానులు ప్రమాదకర వ్యర్థాలను చాటుగా విసిరేస్తూ, డ్రైనేజీలలో కలిపేస్తూ, డంప్ యార్డులకు తీసుకువెళ్లి సాధారణ వ్యర్థాల్లా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పడేస్తున్నారు.
ఎంతమందికి ఏ వ్యాధి ఉందో!
అనధికారికంగా నడిపే ల్యాబ్‌ల యజమానుల నిర్వాకంతో అసలు సదరు ప్రాంతంలో ఏ వ్యాధి విస్తరిస్తోందో.. ఎందరు ఏ వ్యాధితో సతమతమవుతున్నారో తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్‌లు, అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్‌ల నుంచి వస్తున్న రిపోర్టుల ఆధారంగా మాత్రమే వ్యాధి విస్తరణపై నిర్థారణ, బాధితుల సంఖ్యపై స్పష్టతకు రావలసి ఉంటుంది. వీటి ఆధారంగానే తుది గణాంకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ గణాంకాలనే ప్రభుత్వ అధికారులు ప్రజలకు వెల్లడిస్తున్నారు. ఈ గణాంకాల్లో అనుమతులు పొందని ల్యాబ్‌లు నిర్వహించే పరీక్షల వివరాలు ఉండవు. దీంతో అధికారులు చెప్పే గణాంకాలు అవాస్తవాలయ్యే అవకాశం ఉంది. కాకి లెక్కల్ని కూడా కచ్చితమైనవని నమ్మాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అనధికార ల్యాబ్‌లలో గుర్తిస్తున్న బాధితుల సంఖ్యపై అధికారుల వద్ద ఏ లెక్కా లేదు.
అనుమతులు లేనివే ఎక్కువ
జిల్లా వ్యాప్తంగా ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్ల అంశం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు కంటే నకిలీ రెండొందల శాతం ఎక్కువగా కొనసాగుతుండడం అధికారుల నిబద్ధతను ప్రశ్నిస్తోంది. ఏ విభాగం అయినా అసలు కంటే నకిలీ అధికమనే స్థితి ఉండదు. అసలులో ఇన్నో అన్నో నకిలీలు చేరడం చూస్తుంటాం. కానీ ఆశ్చర్యకరంగా అనుమతి పొందిన ల్యాబ్‌లు జిల్లాలో 116 మాత్రమే ఉంటే అనధికారికంగా కొనసాగుతున్న ల్యాబ్‌లు 224 ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌ల సంఖ్య 340. ఇవి కాక మరో 12 దరఖాస్తులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అనుమతులు పొందేందుకు సిద్ధంగా ఉన్నాయి.
కార్పొరేట్ ల్యాబ్‌ల ఘనకార్యమిదీ..
స్థానిక ల్యాబ్‌ల నిర్వాకం ఇలా ఉంటే, వైద్య ఆరోగ్య పరీక్షలను కార్పొరేట్ ల్యాబొరేటరీలు శాసిస్తున్నాయి. మెట్రో నగరాల్లో బ్రాంచ్‌లు పెట్టి స్థానికంగా కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. శాంపిల్ కలెక్టర్‌ను నియమించి ఆ వ్యక్తి ద్వారా స్థానిక కలెక్షన్ పాయింట్లను నమూనాలను తీసుకు వస్తారు. కొన్ని పరీక్షలు అక్కడే నిర్వహిస్తారు. మరొకొన్నింటిని ఇతర ప్రాంతాలకు పంపిస్తారు. స్థానికంగా నిర్వహించే ఏ కలెక్షన్ పాయింట్‌కూ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో అనుమతులు లేవు. రక్తం, మల మూత్రాలు, కళ్లె, సూదులు, దూదులు ఇలా బయోమెడికల్ వ్యర్థాలను ఏం చేస్తారో అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమవుతున్నాయో తెలియడం లేదు.
పుట్టగొడుగుల్లా మెడికల్ ల్యాబ్‌లు
జిల్లాలో వందల సంఖ్యలో
అనధికారికంగా నిర్వహణ
వ్యర్థాల నిర్వహణలో అలసత్వం
ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ప్రాణాంతకంగా వేస్టేజీ
బయో మెడికల్ వేస్టేజీని సమర్థవంతంగా నిర్వహించకపోతే ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి, సి, హెచ్‌ఐవి, ట్యూబర్‌క్యులోసిస్, చర్మవ్యాధులు, గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ఇన్‌ఫెక్షన్లు, సెప్సిస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. ఇవి ప్రాణాంతకం. నిర్థిష్ట అనుమతులు పొంది మాత్రమే ల్యాబ్‌లు నిర్వహించాలి. వాడిన సూదులు, రక్తంతో నిండిన గాజు వస్తువులు, శస్త్రచికిత్స పరికరాలు, పాడైపోయిన మందులు హాని కలిగిస్తాయి. ప్రజలు ఇటువంటి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి. పరీక్షలు చేయించుకునేటప్పుడు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న ల్యాబ్‌లను మాత్రమే ఎంచుకోవాలి.
– డాక్టర్ ఎంపీఆర్ విఠల్, విశ్రాంత సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ
రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించాలి
ల్యాబ్ రిజిస్ట్రేషన్ల కోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. బయో మెడికల్ వ్యర్థాలను సేకరిస్తున్న సంస్థ ధరలు నియంత్రించాలి. ఈ విషయాన్ని విన్నవిస్తూ ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేకపోయింది. అనధికారికంగా ల్యాబ్‌లు నడపడాన్ని సంఘం తరఫున ప్రోత్సహించం. ఈ చర్యలు ప్రజలకు ప్రాణసంకటం. కార్పొరేట్ ల్యాబ్‌ల కార్యకలాపాలపై పర్యవేక్షణ కొనసాగాలి. పరీక్షల ధరల నియంత్రణకు నిర్థిష్ట విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించి అమలు చేయాలి.
– వెంకట్, అధ్యక్షుడు, కాకినాడ డిస్ట్రిక్ట్ మెడికల్ లేబొరేటరీస్ అసోసియేషన్

భయో వ్యర్థాలు!

భయో వ్యర్థాలు!

భయో వ్యర్థాలు!

భయో వ్యర్థాలు!

భయో వ్యర్థాలు!