
రత్నగిరి కిటకిట
సత్యదేవుని దర్శనానికి 30 వేల మంది
అన్నవరం: రత్నగిరి శనివారం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయప్రాంగణం, వ్రతమండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చి తిరుచ్చి వాహనంపై ప్రాకార సేవ నిర్వహించారు.
కాగా, రత్నగిరి ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగించనున్నారు.
ఫోన్లు భద్రపరిచేందుకు రికార్డుస్థాయిలో వేలం
రత్నగిరికి వచ్చే భక్తుల సెల్‌ఫోన్లు, కెమేరాలు భద్రపరచేందుకు శనివారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలంపాట నెలకు రూ.8.11 లక్షలు చొప్పున ఏడాదికి రూ.97.32 లక్షలకు రికార్డు స్థాయిలో ఖరారైంది. సెల్‌ఫోన్ భద్రపర్చడానికి ఇప్పటి వరకు రూ.ఐదు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉండగా దానిని రూ.పదికి పెంచడంతో వేలంపాట భారీగా పెరిగింది. రూ.ఐదు వసూలుకు రెండేళ్ల క్రితం వేలం పాట నిర్వహించగా నెలకు రూ.3.31 లక్షలకు ఖరారైంది. కాగా ఆ వసూలు రూ.పది పెంచగా వేలం రెట్టింపు అంటే రూ.6.62 లక్షలు కావాలి. కానీ అంతకంటే ఎక్కువ మరో రూ.1.49 లక్షలు పెరిగింది. ఇలా ఏడాదికి ఖరారైన వేలం రూ.97.32 లక్షలపై 18 శాతం జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. అంటే దాదాపు రూ.17.46 లక్షలు జీఎస్టీ చెల్లించాలి. అంటే ఏడాదికి సుమారు రూ.1.15 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రెండో ఏడాది పదిశాతం పాట సొమ్ము పెంచాలి. దానిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సెల్‌ఫోన్లు భద్రపరచడానికి రూ.ఐదు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.పది వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పాటదారులు అధికార పార్టీ వ్యక్తులు కావడంతో అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో మిగిలిన పాటదారులు సెల్‌ఫోన్ భద్రపరిచేందుకు అన్ని దేవస్థానాలలో రూ.పది వసూలు చేస్తున్నారని, ఇక్కడ కూడా రూ.పది వసూలు చేసేలా వేలం నిర్వహించాలని వినతిపత్రం ఇచ్చారు. దాంతో ఆ మేరకు వేలం నిర్వహించారు. మరో నాలుగు అంశాలపై వేలంపాట వాయిదా వేశారు. వేలంపాటలో ఏఈఓ ఎల్.శ్రీనివాస్, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

రత్నగిరి కిటకిట