మిత్రోత్సాహం.. | - | Sakshi
Sakshi News home page

మిత్రోత్సాహం..

Aug 3 2025 3:28 AM | Updated on Aug 3 2025 3:28 AM

మిత్ర

మిత్రోత్సాహం..

సోషల్‌ మీడియా వేదికగా

బలపడుతున్న స్నేహం

మనసుకు ఓదార్పునిస్తున్న బంధం

నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

రాయవరం: స్నేహం.. సృష్టిలో మధురమైంది.. జీవితంలో మరువలేనిది.. ఆత్మీయతను పంచేది.. ఆహ్లాదాన్ని అందించేది.. అక్షరాలకతీతమైన పుస్తకం లాంటిది.. భారమైన హృదయానికి ఓదార్పునిస్తుంది.. కష్టాల్లో ఆసరా అవుతోంది. ఇలా స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతమని అంటుంటారు. ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొనేందుకు మిత్రులంతా సిద్ధమవుతున్నారు. సెల్‌ఫోన్‌ వినియోగం మనుషుల మధ్య సంబంధాలను మరింత దగ్గర చేసింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సరికొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి. సోషల్‌ మీడియా సమాచార వ్యాప్తిలో ప్రధాన భాగస్వామిగా నిలుస్తుంది. ఒకప్పుడు ఉత్తరాలు, తదుపరి ఫోన్‌లో మాట్లాడుకునే స్థాయి నుంచి సోషల్‌ మీడియా సాయంతో దేశ, విదేశాల్లో ఉంటున్న వారు సైతం వీడియో కాల్స్‌ ద్వారా సంభాషణలు సాగిస్తున్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, మార్పులు చేర్పులను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్‌ గ్రూపులతో సామాజిక సంబంధాల్లో ఊహించని మార్పు వచ్చింది. 90 శాతం మంది మొబైల్‌ ఫోన్లలో మై ఫ్యామిలీ, టెనన్త్‌ క్లాస్‌, ఇంటర్‌, డిగ్రీ పేర్లతో తప్పనిసరిగా వాట్సాప్‌ గ్రూపులు ఉంటున్నాయి. ఈ గ్రూపుల ద్వారా చిన్ననాటి స్నేహితుల నుంచి ఆఫీసులో కొలీగ్స్‌ వరకూ అందరూ నిత్యం టచ్‌లో ఉంటున్నారు. స్నేహితుల దైనందిన జీవితంలో జరిగే మంచి చెడులను ఎప్పటికప్పుడు పంచుకోవడమే కాదు, శుభాకాంక్షలూ చెప్పుకొంటున్నారు.

రెండు దశాబ్దాల నుంచి..

రాయవరంలో 2002లో తొలిసారి 1981–82 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు కలిశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా రాయవరంలో కలిసినట్లు చె బుతుంటారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రచా రం కావడంతో ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు నాంది పలికినట్లైంది. అప్పుడు ప్రారంభమైన పూర్వ విద్యార్థుల కలయిక దినదినప్రవర్ధమానమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఏటా సంక్రాంతి సమయాల్లో లేదా, వేసవి సెలవుల్లో, వివిధ సందర్భాల్లో కలుసుకుంటున్నారు.

ప్రతి సమాచారం వాట్సాప్‌లోనే..

పూర్వ విద్యార్థులు పలు వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేస్తున్నారు. ఈ గ్రూపుల్లో నిత్యం స్నేహితుల యోగక్షేమాలతో పాటు, గ్రామంలో జరుగుతున్న కార్యకలాపాలను కూడా షేర్‌ చేసుకుంటున్నారు. స్నేహితుల కష్టసుఖాలను తెలుసుకుంటూ అవసరమైన మేరకు మిగిలిన వారిని ఆదుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపులు ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇది కదా స్నేహమంటే..

రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1989–94 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 2016 జనవరిలో కలిశారు. తమ బ్యాచ్‌కు చెందిన నలుగురు స్నేహితుల ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అంతా కలసి ఆర్థిక సాయం అందించారు. నలుగురు విద్యార్థులకు రూ.5.25 లక్షలు అందజేశారు. అలాగే 2016 నుంచి ఏటా రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15న పూర్వ విద్యార్థులంతా కలుసుకుని, పాఠశాలలో మెరిట్‌ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకూ రూ.6.50 లక్షలు విద్యార్థులకు అందజేశారు. స్నేహమంటే కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం కాదని, మిత్రులకు, సమాజానికి మంచి చేయాలని నిరూపిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలామంది స్నేహ హస్తాన్ని అందిస్తున్నారు.

జాగ్రత్తలూ అవసరమే..

సోషల్‌ మీడియా ఆసరాగా చేసుకుని కొందరు ఫేక్‌ ఫ్రెండ్‌షిప్‌లు చేస్తున్నారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాట్సాప్‌, ఇన్‌స్ర్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడుతున్నారు. అపరిచితులు పరిచయాలను పెంచుకుంటున్నారు. పరిచయాన్ని స్నేహంగా మలచుకుంటున్నారు. ఆపై స్నేహాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడడం వంటి ఘటనలు చూస్తున్నాం. సోషల్‌ మీడియా ఫ్రెండ్‌షిప్‌ పట్ల యువత, ముఖ్యంగా బాలికలు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌షిప్‌ మొదటికే మోసం తెస్తుండడంతో అపరిచితులతో ఆచితూచి స్నేహం చేయాల్సిన అవసరం కూడా ప్రస్తుత కాలంలో ఉంది. ఇదిలాఉంటే మార్కెట్‌లో ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్ల అమ్మకాలు విరివిగా జరుగుతున్నాయి.

మిత్రోత్సాహం..1
1/1

మిత్రోత్సాహం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement