రాజోళి: రేషన్ డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా తూనికల, కొలతలశాఖ అధికారి రవీంద్ర హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని రేషన్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 17వ నంబర్ రేషన్ షాప్‌లో కాంటాపై ఖాళీ గన్నీబ్యాగు ఉంచి బియ్యం కాంటా చేస్తున్నట్లు గుర్తించి.. డీలర్‌కు రూ.5వేల జరిమానా విధించారు. ప్రజలను మోసం చేయడం సరికాదని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, తమకు స్టాక్ పాయింట్ నుంచి తక్కువ తూకంతో బియ్యం సరఫరా చేస్తున్నారని డీలర్లు అధికారి దృష్టికి తీసుకొచ్చారు.
మాంసం విక్రయానికి లైసెన్స్ తప్పనిసరి
అలంపూర్ రూరల్: అలంపూర్ మున్నిపాలిటీలో మాంసం, చేపల విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని పుర కమిషనర్ రాజేశ్ సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మాంసం విక్రయదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాంసం దుకాణాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం 5వ వార్డులో నెలకొన్న సమస్యను పరిష్కరించారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వంట గది, టాయిలెట్లను పరిశీలించారు. కమిషనర్ వెంట మున్సిపల్ చైర్మన్ జయరాముడు, కౌన్సిలర్లు మోహన్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు కృష్ణమూర్తి ఉన్నారు.
అందుబాటులో ఎరువులు
మల్దకల్: రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని విఠలాపురంలో హాకా రైతు సేవాకేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి.. సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. భూ సారం పెంపునకు సేంద్రియ ఎరువులు ఎంతో దోహదపడతాయన్నారు. మాజీ ఎంపీపీ రాజారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రమేశ్‌నాయుడు, పురుషోత్తంరెడ్డి, గోపాల్‌రెడ్డి, సత్యారెడ్డి, సుధాకర్‌గౌడ్, బాబురెడ్డి పాల్గొన్నారు.
కార్మికులకు రూ.26వేల వేతనం ఇవ్వాలి
గద్వాల: ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు రూ. 26వేల వేతనం ఇవ్వాలని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక జీజీహెచ్ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించడంతో పాటు నాలుగు పండుగలు, నాలుగు జాతీయ సెలవులు, 15 ఆర్జిత సెలవులను అమలు చేయాన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సక్రమంగా జమ చేయాలని, చట్టప్రకారం సంవత్సరానికి ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలన్నారు. ప్రతి కార్మికుడికి గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటరామిరెడ్డి, పరుశరామ్, బాషా, నాగరాజు, అంజనమ్మ, చిట్టెమ్మ, మహేశ్వరి, నాగేంద్రమ్మ, వెంకటేశ్వరి, కిష్టమ్మ, వెంకటేశ్, మునరీషాబేగం, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.


