ఆత్మకూర్: వానాకాలం ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు పడిన దాఖలాలు లేవు. ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటిమట్టం క్రమంగా తగ్గిపోతోంది. భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు ఏకంగా 2 టీఎంసీలకు పడిపోగా.. రామన్‌పాడు రిజర్వాయర్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. వర్షాలు పడకపోతే తాగునీటి ముప్పు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రానీయకుండా మిషన్ భగీరథ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత, గాలుల వేగానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మంది అవసరాలు తీర్చేందుకు నిత్యం మిషన్ భగీరథ పథకం ద్వార 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలకు 27.6 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్లు ఫర్ డే), గ్రామాలకు 48.435 ఎంఎల్‌డీ నీటిని అందిస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌పైనే తాగునీటి పథకాలు కొనసాగుతున్నాయి. జూలైలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యమ్నాయంగా మార్గాలను చూసుకుంటూ బోర్లు, చేతిపంపులు, ట్యాంకర్లను సిద్ధం చేశామని అధికారులు పేర్కొంటున్నారు.
తాగునీటి పథకాలకు సరఫరా ఇలా..
2 టీఎంసీలకు పడిపోయినజూరాల నిల్వలు
రామన్‌పాడులోనూ అదే పరిస్థితి
చెరువులు, కుంటల్లో తగ్గిన నీటిమట్టం
నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటి సరఫరా


