గద్వాల: సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని.. పౌరులు అడిగే సమాచారాన్ని అధికారులు విధిగా అందించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో స.హ. చట్టంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకోసారి ఆయా శాఖల వారీగా వచ్చిన స.హ. చట్టం దరఖాస్తులు, వాటి పరిష్కారం ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉందో పూర్తి వివరాలను రాష్ట్ర కమిషనర్‌కు నివేదిక పంపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స.హ. చట్టం దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తమవంతు కృషిచేసే పౌరులు వివిధ శాఖల సమాచారాన్ని పొందుతుంటారని.. అధికారులు సంబంధిత సమాచారాన్ని నిర్ధేశిత గడువులోగా ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఏఓ భూపాల్‌రెడ్డి, ఆర్టీఐ సెక్షన్ అధికారి సరితారాణి ఉన్నారు.


