● పునరావాస కేంద్రంలో
కనీస వసతులు కరువు
● అసంపూర్తిగానే పాఠశాల భవనం
● రోడ్ల నిర్మాణాలకు లభించని మోక్షం
గట్టు: చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలతో నిర్వాసితులు సతమతమవుతున్నారు. తమ గోస ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. చిన్నోనిపల్లె రిజర్వాయర్‌లో ముంపునకు గురైన గ్రామాన్ని అంతంపల్లి సమీపంలోని ఎర్రగట్టు వద్ద ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలు మాత్రం సంవత్సరాల తరబడి తీరడం లేదు. ప్రధానంగా ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన తడకల షెడ్లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ భవనం కూడా కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉంది. పాఠశాల, అంగన్‌వాడీ భవనాలను పూర్తిచేయాలని అనేక పర్యాయాలు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.
ఏడేళ్లుగా అసంపూర్తిగానే..
చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం నుంచి రిజర్వాయర్, బోయలగూడెం వరకు బీటీరోడ్డు నిర్మాణానికి 2017లో రూ. 1.85కోట్లు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారు.. 2018లో పనులను ప్రారంభించి, కేవలం మట్టి, కంకర వేసి వదిలేశారు. ఏడేళ్లుగా బీటీరోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే బోయలగూడెం, లింగాపురం, అంతంపల్లి, చిన్నోనిపల్లె గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. మరోవైపు చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం నుంచి భూంపురం వరకు కొత్తగా మంజూరైన బీటీరోడ్డు నిర్మాణ పనులు సైతం ప్రారంభానికి నోచుకోవడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం సమర్పించారు. పునరావాస కేంద్రంలో అసంపూర్తి భవనాలు, లింకు రోడ్లను పూర్తిచేయాలని మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్ మంత్రికి విన్నవించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు తీర్చాలని చిన్నోనిపల్లె నిర్వాసితులు కోరుతున్నారు.


