బ్యాగుల కొరత.. బిల్లులు అరకొర | - | Sakshi
Sakshi News home page

బ్యాగుల కొరత.. బిల్లులు అరకొర

Jul 5 2026 2:30 AM | Updated on Jul 5 2026 2:30 AM

రాజోళి: అష్టకష్టాలు పడి మొక్కజొన్న అమ్ముకున్న రైతులకు రావాల్సిన బిల్లులు ఇంకా పూర్తిస్థాయిలో అందకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. గత మే నెల వరకు కొనసాగిన మొక్కజొన్న కొనుగోలులో.. తమ పంటను అమ్ముకునేందుకు రైతులు చేసిన ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. దీనికి తోడు వ్యాపారులు, దళారులు చేతివాటంతో కొనుగోలు ప్రక్రియలో ఎన్నెన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆరుబయట స్థలాల్లో ఆరబోసుకుని తమవంతు వచ్చే వరకు ఎదురుచూసిన రైతులను లారీలు సక్రమంగా రాకపోకవడంతోపాటు గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా వేధించింది.

అసలు సమస్య బ్యాగులదే..

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు సందర్భంగా రైతులకు లక్షలాది గన్నీ బ్యాగులు అవసరమయ్యాయి. జిల్లాలోని 11 పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టగా.. బ్యాగులను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ, పంట దిగుబడులు కొనుగోలు కేంద్రాలకు చేరాక కూడా గోనె సంచులు అందుబాటులోకి రాలేదు. బ్యాగులు పంపాల్సిన కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. చివరికి రైతులే బ్యాగులు ఏర్పాటు చేసుకోవాలని, దానికి ప్రభుత్వం నుంచి డబ్బులు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో ఒక గన్నీ బ్యాగుకు రూ.30 చొప్పున వెచ్చించి రైతులు కొనుగోలు చేశారు. 11 కొనుగోలు కేంద్రాల దగ్గర 12 లక్షల బ్యాగుల్లో లోడ్‌ చేశారు. అప్పటికే ప్రభుత్వం నుంచి కేవలం 3 లక్షల బ్యాగులు మాత్రమే రైతులకు అందగా.. మిగతా 9 లక్షల బ్యాగులు రైతులే తెచ్చుకున్నారు. కాగా ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాక రెండు వారాలకు పైబడి గన్నీ బ్యాగుల నమోదు లేకపోవడంతో చాలామంది రైతులు నమోదు చేసుకోలేకపోయినట్లు తెలుస్తుంది. మొత్తం రూ.1,80,10,500 ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1,35,10,500 గన్నీ బ్యాగులు కొనుగోలు చేసిన రైతులకు అందజేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా రూ.45 లక్షల వరకు రైతులకు ఇవ్వాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రైతులు వెచ్చించిన డబ్బులకు, అధికారులు చెల్లించిన డబ్బులకు సగానికి కోత ఉందని రైతులు వాపోతున్నారు.

వడ్డేపల్లి పీఏసీఎస్‌లో గన్నీ బ్యాగుల బిల్లులు అందజేస్తున్న

అధికారులు

మొక్కజొన్న కొనుగోలుకు గన్నీ సంచులు సమకూర్చని ప్రభుత్వం

అధికారుల సూచనతో స్వయంగా తెచ్చుకున్న రైతులు

అప్పటి డిమాండ్‌నుబట్టి రూ.30 చొప్పున వెచ్చింపు

తాజాగా ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.15–22 మాత్రమే..

బిల్లులు త్వరగానే ఇచ్చినా నష్టపోయిన అన్నదాతలు

ఎవరికి లాభమో..

గన్నీ బ్యాగులు అందుబాటులో లేవు. మీరే తెచ్చుకోండి.. మీకు బిల్లు వస్తుందని అధికారులు చెబితే రైతులంతా ఒకేసారి బ్యాగుల కోసం ఎగబడ్డారు. ఇదే అదునుగా ఒక్కో సంచి రూ.30 చొప్పున అమ్మారు. అయితే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకు ఒక్కో సంచికి రూ.22, నేరుగా లెక్క రాయించిన వారికి కేవలం రూ.15 చొప్పున వస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచి కొనుగోలు చేసిన దాంట్లో సగం ధరనే ఇచ్చే బదులు, కొనుగోలు సమయంలోనే ఆ ధరలకు బ్యాగులు తెప్పించి ఇచ్చి ఉంటే ఈ నష్టం మాకు కలిగేది కాదని, ఒక్కో సంచికి రూ.15 అయినా లక్షల సంచుల మీద ఎంత మేర.. ఎవరికి లాభం చేకూరుతుందోనని రైతులు విమర్శిస్తున్నారు.

వారం రోజుల్లో చెల్లిస్తాం..

ధాన్యం కొనుగోలు సమయంలో బ్యాగుల కొరత ఉన్న మాట వాస్తవమే. అప్పుడు రైతులు కొన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు ఉన్న వారికి రూ.22, నేరుగా రాయించిన వారికి రూ.15 చొప్పున ఇప్పటికే రూ.కోటికిపైగా అందజేశాం. పెండింగ్‌లో ఉన్న డబ్బులను మరో వారంలో రైతులకు అందజేస్తాం.

– రాణి, ఇన్‌చార్జి డీసీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement