కేటీదొడ్డి: నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం పరిధిలోని ప్రధాన కుడి కాల్వ, ఎడమ కాల్వల నిర్మాణం కోసం భూ సేకరణ సర్వే శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో మండలంలోని మల్లాపురం, కేటీదొడ్డి గ్రామాల పరిధిలో జరుగుతున్న సర్వే పనులను శనివారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాల్వల అలైన్‌మెంట్, రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్ట్‌ను త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సర్వే ప్రక్రియలో ఎక్కడా ఆలస్యం జరగకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
గద్వాల న్యూటౌన్: తీగజాతి కూరగాయల సాగులో భాగంగా పందిళ్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యానవన అధికారి రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర ఎకరా యూనిట్‌గా పరిగణిస్తారని, ఒక యూనిట్ విలువ రూ.లక్ష కాగా.. 50 శాతం సబ్సిడీపై రూ.50 వేలకు అందిస్తారన్నారు. దరఖాస్తు ఫారాలు ఆయా ఉద్యానవన శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తుకు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ జిరాక్స్ పత్రాలను జతపరిచి పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలకు గద్వాల డివిజన్ ఉద్యాన అధికారి రాజశేఖర్ సెల్ నం.89777 14295, అలంపూర్ డివిజన్ అధికారి ఇమ్రానా సెల్ నం. 89777 14296, అయిజ డివిజన్ అధికారి మహేష్ సెల్ నం. 89777 14297లను సంప్రదించాలని సూచించారు.
పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యం
హన్వాడ: పాలమూరు జిల్లా జలవనరుల పరిరక్షణకు దశాబ్దాలుగా నలుగుతున్నా.. పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 19న రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌నును జేఏసీ నాయకులు హన్వాడలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోరాటం రాజకీయాలకతీతంగా జిల్లా ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత విస్తారమైన కృష్ణానది పరివాహక ప్రాంతం దాదాపు 300 కి.మీ. మహబూబ్‌నగర్‌లోనే ఉన్నప్పటికీ.. సాగు, తాగునీటి కష్టాలు తప్పకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశా రు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, ప్రాజెక్టులు పూర్తి చేసి రిజర్వాయర్లలో నీటిని నింపితే వలసలు ఆగిపోతాయన్నారు.


