గద్వాల: ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా వందశాతం పూర్తిచేయాలని డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి చెన్నయ్య అధికారులను ఆదేశించారు. సర్–2026లో భాగంగా శనివారం డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి చెన్నయ్య గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని జమ్మిచేడు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఓటరుని గుర్తించి జాబితాలో నమోదు చేయడం అధికారుల ప్రధాన బాధ్యత అన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్‌ను కూడా వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. డాటా నమోదు సమయంలో అత్యంత జాగ్రత్తతో నమోదు చేయాలని సూచించారు. ఇంటింటి సర్వేను పూర్తిస్థాయిలో నిర్వహించి ఏఎస్‌డీ(ఆబ్సెంట్ షిఫ్టెడ్, డెత్) జాబితాను క్షేత్రస్థాయి ధ్రువీకరణ ఆధారంగా సిద్ధం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డిజిటలైజేషన్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయడంతోపాటు డాటా ఎంట్రీలో డూప్లికేట్ నమోదు, అసంపూర్తి వివరాలు లేదా ఇతర లోపాలకు ఆస్కారం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ హరికృష్ణ, ఎన్నికల విభాగం అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు.


