ఆపరేషన్ ముస్కాన్‌తో బాలకార్మికుల గుర్తింపు
ప్రత్యేక బృందాల ఏర్పాటు..
●
ఏడేళ్లలో వెట్టి నుంచి విముక్తి పొందిన బాలలు ఇలా..
గద్వాల క్రైం: పుస్తకాలతో బడులకు పరుగులు తీయాల్సిన బాలలు ఎంతో మంది వెట్టిచాకిరీ అనే బరువును భుజస్కాందాలపై వేసుకుని తమ ఆశయాలను బాల్యంలోనే బందీ చేసుకుంటున్నారు. పంట పొలాలు, హోటళ్లు, వస్త్ర, కిరాణ దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ధనవంతుల ఇళ్లలో పనులు చేస్తూ కొందరు.. రైల్వేస్టేషన్, బస్టాండ్ కూడళ్లలో భిక్షాటన చేస్తూ మరికొందరు బాలలు మగ్గిపోతున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫాలితాన్నిస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. వెట్టిలో మగ్గిపోతున్న ఎంతో మంది బాలలకు విముక్తి కల్పిస్తున్నారు. జిల్లాలో గతేడాది 72మంది బాలకార్మికులను గుర్తించగా.. ప్రస్తుతం ఆపరేషన్ ముస్కాన్–14 కొనసాగుతోంది.
జిల్లావ్యాప్తంగా బాలకార్మికులను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా గుర్తించినప్పటికీ మళ్లీ యథాస్థితికే చేరుతున్నారు. హోటళ్లు, ఇతర దుకాణ సముదాయాల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి బడులకు పంపుతున్నా.. మళ్లీ కొంతకాలానికి తిరిగి పనుల్లోనే దర్శనమిస్తుండటం గమనార్హం. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంటుంది. మరోవైపు ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి తప్పిపోయి వచ్చి ఎక్కడో ఒక చోట యాచకులుగా మారి జీవనం సాగిస్తున్నారు. అయితే నెలల తరబడి పనులు చేస్తున్న చిన్నారులను పట్టించుకోని ఆయా శాఖల అధికారులు.. ఈ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మాత్రమే దృష్టి సారించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన కార్మికశాఖ, ఐసీపీఎస్, విద్యాశాఖ అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపడితేనే అనుకున్న లక్ష్యం సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి దిశగా కార్యాచరణ
జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు
గతేడాది 72 మంది బాలకార్మికుల గుర్తింపు
నడిగడ్డలో బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించడంపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తోంది. పోలీసు, కార్మికశాఖ అధికారులతో పాటు బాలల సంరక్షణ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బాలలతో పనులు చేయించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వెట్టి నుంచి విముక్తి పొందిన పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. సమీప పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.


