గద్వాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంత్సరానికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ), కంప్యూటర్ ప్రోగ్రామింగ్ (సీపీఎస్), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) బ్రాంచ్‌ల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసి.. కౌన్సెలింగ్‌లో సీటు పొందని అభ్యర్థులతో పాటు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. గోన్‌పాడులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని.. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, పాలిసెట్ ర్యాంక్ కార్డు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువపత్రం, ఇతర సంబంధిత పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.


