పలుమార్లు ఇంజినీర్ల బృందం సందర్శన.. | - | Sakshi
Sakshi News home page

పలుమార్లు ఇంజినీర్ల బృందం సందర్శన..

Jul 3 2026 12:40 AM | Updated on Jul 3 2026 12:40 AM

పలుమార్లు ఇంజినీర్ల బృందం సందర్శన.. కొనసాగుతున్న పనులు..

సివిల్‌ గ్రౌంటింగ్‌ పరీక్షలకు రూ.1.66కోట్లు.. ఆనకట్ట రిపేరుకు రూ.3.66 కోట్లు మంజూరు

ప్రారంభమైన మట్టి నమూనాల సేకరణ

పుణె సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నివేదికతో

మరమ్మతు పనులు

ర్యాలంపాడు రిజర్వాయర్‌ మరమ్మతుకు సంబఽంధించి ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం మట్టి నమూనా సేకరణ పనులు కొనసాగుతున్నాయి. అనంతరం పుణెకు చెందిన ఇంజినీరింగ్‌ బృందం ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపడుతాం.

– రహీముద్దీన్‌, ఎస్‌ఈ, ఇరిగేషన్‌శాఖ

గద్వాల: నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుండెకాయగా పిలువబడే ర్యాలంపాడు రిజర్వాయర్‌ మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. నాలుగేళ్ల క్రితం ఆనకట్టకు లీకేజీలు ఏర్పడటంతో 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఫలితంగా జలాయశం ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్‌లో రెండవ పంటకు సాగునీరు లభించక క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలంపాడు రిజర్వాయర్‌ ఆనకట్ట మరమ్మతు కోసం ఆయకట్టు రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది.

లోపభూయిష్ట నిర్మాణంతో..

గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శ్రీకారం చుట్టారు. 2009 వరకు ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టింది. వైఎస్సార్‌ అకాల మరణంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయ్యాయి. అయితే ప్రాజెక్టులో మొత్తం ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ఇందులో ర్యాలంపాడు రిజర్వాయర్‌ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ఇందులో 4 టీఎంసీలు ర్యాలంపాడు రిజర్వాయరే కావడం ప్రాధాన్యత తెలియజేస్తుంది. అయితే రిజర్వాయర్‌ నిర్మాణ పనులను దక్కించుకున్న గుత్తేదారు.. లోపభూయిష్టంగా నిర్మించడం, అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో అందుబాటులోకి వచ్చిన రెండేళ్లకే ర్యాలంపాడు రిజర్వాయర్‌ ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా సుమారు 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం ఒక పంటకే సాగునీటిని అందించాల్సిన దుస్థితి నెలకొంది.

ర్యాలంపాడు రిజర్వాయర్‌కు మరమ్మతు చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా రూ.60 లక్షలతో హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరు నెలలపాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్‌ బృందంతో సర్వే చేయించింది. వారు రెండుసార్లు రిజర్వాయర్‌ను సందర్శించి.. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మేరకు రిజర్వాయర్‌ మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్‌సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్‌కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement