మల్దకల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు సూచించారు. గురువారం మల్దకల్ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం ఆవశ్యతకపై అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా అర్హులైన పేదలు ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. సీజనల్‌గా ప్రబలే వ్యాధుల నివారణకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి.. స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంపీఓ జాకీర్ ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,542
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 984 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,542, కనిష్టంగా రూ. 3,110, సరాసరి రూ. 6,050 ధరలు పలికాయి. అదే విధంగా 13 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాకు రూ. 1,809 ధర వచ్చింది. క్వింటా కందులు రాగా.. రూ. 6,389 ధర పలికింది.
ఉత్సాహంగా వాలీబాల్ అకాడమీ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న వాలీబాల్ అకాడమీ ప్రవేశాల కోసం గురువారం రాష్ట్రస్థాయి బాలబాలికల సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 71 మంది బాలురు, 24 మంది బాలికలు హాజరయ్యారు. ఈ సెలక్షన్ ట్రయల్స్‌ను జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, వసతి, భోజనంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలను కల్పిస్తూ క్రీడారంగ అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. ట్రయల్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు ఎత్తు, శారీరక దారుఢ్యం, ఆట నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ ఆధారంగా ఎంపిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను త్వరలో ప్రకటించనున్నట్లు జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిష్ణాతులైన కోచ్‌ల ద్వారా ఉన్నతస్థాయి శిక్షణతో పాటు వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
మొదటిరోజు
నామినేషన్లు నిల్
అమరచింత: చేనేత సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి మొదటి రోజైన గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు తెలిపారు. 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని.. నామినేషన్ ఫారాలు తీసుకున్న వారు ఎన్నికల ఫీజు బీసీ కుల ధ్రువీకరణ పత్రం జత చేస్తే రూ.750, లేకుంటే రూ.1000 చెల్లించాలన్నారు. వీటితోపాటు ఎన్నికల వ్యయం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు అదనంగా రూ.2 వేలు ముందస్తుగా చెల్లించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10వ తేదీన చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.


