గద్వాల: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో తన చాంబర్‌లో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు జిల్లాలో సర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 90.99శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు పూర్తి సరైన వివరాలతో నింపి.. సంబంధిత బీఎల్‌ఓలకు తిరిగి అందించేలా చైతన్యపర్చాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి.. ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందిందుకు తమవంతు సహకారం అందించాలన్నారు. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి.. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. వాటి పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారి ముంజుల, తహసీల్దార్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.


