ఉన్నంతలో ఒదగలేక..
మచ్చుకు కొన్ని..
మూడు నెలల్లో 20కి పైగా బలవన్మరణాలు
● ఆర్థిక సమస్యల
భూతం బూచిగా ఘటనలు
● మృతుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, యువత
● వరుస ఘటనలతో కలవరం
–8లో u
గద్వాల క్రైం: నలుగురిలో ప్రత్యేకతను చూపాలనే తప్పన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ క్రమంలోనే ఉన్నంతలో ఒదగలేక అప్పుల కోసం పరుగులు పెట్టడం షరామామూలుగా మారింది. ఆ తర్వాత తీసుకున్న అప్పులు చెల్లించే స్థోమత లేదంటూ బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వ్యాపారులు, యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరు క్షణికావేశంలో బాధ్యతలు మరిచి తనువు చాలిస్తున్నారు. జిల్లాలో మూడు నెలల వ్యవధిలోనే 20 పైగా బలవన్మరణాలు చోటు చేసుకోవడం అందరినీ కలవరపెడుతోంది.
బాధ్యతలు మరిచి..
ప్రతి బలవన్మరణం వెనుక ఆర్థిక అంశాలు నెలకొన్నాయి. స్థాయికి మించి అప్పులు చేయడం.. ఆపై వడ్డీలు, అసలు చెల్లించే దారిలేక తుదిశ్వాస విడిచి.. తమ కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. సమాజంలో కొందరు ఉన్నత వ్యక్తులు, ఉపాధ్యాయులు, యువత ఒక్క రోజులోనే లక్షాధికారిగా మారిపోవాలి.. సమాజంలో తమకంటూ గుర్తింపు ఉండాలని తహాతకు మించి అప్పులు తీసుకోవడం అలవాటుగా మారింది. తీసుకున్న అప్పులకు కొన్ని నెలలు ఎలాగో వడ్డీలు చెల్లించడం చేస్తుంటారు. చివరకు అప్పులు తీర్చే క్రమంలో మరొకరితో అప్పు కోసం పాకులాడుతారు. కొత్తగా అప్పు పుట్టకపోవడం.. ముందుగా తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక తనువు చాలిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రతి ఒక్కరిలో జీవన విధానాలపై ఆలోచన ఉండాలి. శ్రమించే తత్వంతో పాటు ఆర్థికపరమైన విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఏ వస్తువు ఎంతవరకు అవసరమో గుర్తించాలి. చెడు వ్యసనాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే క్రమంలో అవసరమైన సలహాలు తీసుకోవాలి. ఆర్థిక సమస్యలకు బలవన్మరణం ఒక్కటే పరిష్కారం కాదు. ఆందోళన చెందకుండా పరిష్కారం దిశగా ముందుకుసాగాలి.
– శ్రీనివాసరావు, ఎస్పీ
● గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు జిల్లా కేంద్రంలో అద్దెకు దుకాణం తీసుకొని టాటూ వేస్తూ జీవనోపాధి పొందేవాడు. ఇంటి అవసరాలు, వ్యాపారం కోసం తెలిసిన వ్యక్తులతో కొంత అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు చోటు చేసుకున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై గత మార్చి 24న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నూతన పోకడల దిశగా సగటు వ్యక్తి వెంపర్లాడుతున్నాడు. డబ్బులు పొదుపుగా వినియోగించాలనే ఆలోచనా దోరణి లేకపోవడం.. మార్కెట్‌లో హుందాగా కనిపించాలనే ఆరాటం.. లేని వాటికోసం ఇతరులతో అప్పులు తీసుకోవడం అలవాటుగా మారుతోంది. ఇదే వారిలోని పతనానికి దారితీస్తోంది. చివరకు కుటుంబ బాధ్యతలను మరిచిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్న ఆత్మహత్య ఘటనలు కలవరపెడుతున్నాయి.
అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. తిరిగి అప్పులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఈ నెల 6న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ప్రతి మరణం వెనుక ఆర్థిక అంశాలు నెలకొన్నాయి.
గద్వాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఫైనాన్స్, చీటి వ్యాపారాలు చేసేవాడు. ఇందుకోసం అధిక మొత్తంలో అప్పులు చేశాడు. కొన్ని రోజుల తర్వాత వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు చోటు చేసుకున్నాయి. చివరకు అప్పులు చెల్లించే స్థోమత లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై 2025 డిసెంబర్ 12న గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఒడిశాకు చెందిన ఓ యువకుడు జోవనోపాధి కోసం జిల్లా కేంద్రానికి వలస వచ్చి.. ఓ హోటల్‌లో సర్వర్‌గా పనిచేసేవాడు. అతడి వ్యక్తిగత అవసరాలు, బెట్టింగ్ కోసం స్థాయికి మించి అప్పులు చేశాడు. చివరకు అప్పులు చెల్లించే దారిలేక మనస్తాపానికి గురైన అతడు గత మార్చి 5న హోటల్ సమీపంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


