
జోగుళాంబ ఆలయంలో మాజీ ఎంపీ పూజలు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయాలను మాజీ ఎంపీ బీ. వినోద్ కుమార్ సతీసమేతంగా మంగళవారం దర్శించుకున్నట్లు కార్యనిర్వహణ అధికారి పురేందర్ కుమార్ తెలిపారు. ముందుగా అర్చకులు మాజీ ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్చ ప్రసాదాలను అందజేశారు.
ప్రజారోగ్యంపై
ప్రభుత్వానికి చిత్తశుద్ధి
అలంపూర్: ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని.. అందుకే వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గత బీఆర్‌ఎస్ హయాంలో కేవలం ఓట్ల కోసమే ఆస్పత్రిని వాడుకున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో వైద్య సేవల ప్రారంభంతో నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు తీరతాయని తెలిపారు.
చైతన్య సారథి..‘దాశరథి’
గద్వాలటౌన్: దాశరథి కృష్ణమాచార్యులు ఉద్యమ కవి అని, ఆయన కవితలతో ప్రజలను చైతన్యం చేశారని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కళాందర్‌బాషా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాశరథి జయంతిని ఘనంగా నిర్వహించారు. దాశరథి చిత్రపటానికి ప్రిన్సిపల్ షేక్ కళాందర్ బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాశరథి కవిగానే కాదు జాతీయ ఉద్యమంలో పాల్గొన గొప్ప విప్లవకారుడు అన్నారు. కలానికి పదునుపెట్టి దొరతనానికి వ్యతిరేకంగా పోరాడిన దైర్యశాలి అని కొనియాడారు. దాశరథి రచనలకు ప్రభావితం అయిన ప్రజలు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడారని వివరించారు. చంద్రమోహన్, నాగభూషణం, రాధిక, శంకర్ పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్లకు ఉచిత నైపుణ్య శిక్షణ
గద్వాల: జిల్లాలోని నిరుద్యోగులైన ట్రాన్స్‌జెండర్లకు ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశాల కోసం వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 23వ తేదీలోపు wdsc.telangana. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ట్రాన్స్‌జెండర్‌ల కోసం గరిమా గే షెల్టర్ హోమ్‌ల స్థాపన కోసం నేషనల్‌స్మైల్ ప్రాజెక్టు కింద దరఖాస్తు చేసకోవటానికి సీబీవో లేదా ఎన్‌జీవో సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https.grants-msje.gov.in వెబ్‌సైట్‌లో ఆగస్టు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను కలెక్టరేట్‌లోని రూమ్–జి33లో సమర్పించాలని, వివరాలకు 040–24559050 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
గద్వాల: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు తేదీని ఆగస్టు 31వ తేదీవరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నుషిత ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 210 సీట్ల నుంచి 500 సీట్ల వరకు పెంచినందున ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు www.epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పాత కమిటీని
పురుద్ధరించాలి
అలంపూర్ రూరల్: మండలంలోని హరిహర ఎత్తిపోతల పథకం క్యాతూర్ –2 పాత బెనిఫిట్ కమిటీని పునరుద్ధరించాలని క్యాతూర్, భీమవరం రైతులు ఎస్‌ఈ రహీముద్దీన్, ఈఈ శ్రీనివాస్‌కు మంగళవారం వినతిపత్రాలు అందించారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు కూడా విన్నవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎటువంటి రైతుల మద్దతు లేకుండా ఆగస్టు 2019లో తమకు తాము ఎన్నుకున్న రిజిస్టర్ లేని బెనిఫిషర్ కమిటీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. ఆరేళ్ల నుంచి లిఫ్ట్ నిర్వహణ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. రిజిష్టర్ ఆఫ్ సొసైటీ వద్ద రిజిష్టర్ పొందిన –786ఆఫ్ 2013 ఆయకట్టు దారుల సంఘాన్ని పునరుద్దించాలని కోరారు.