భయం గుప్పిట్లో..

చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ పనులు జరిగే చోటుకు వెళుతున్న మహిళలను అడ్డుకున్న పోలీసులు  - Sakshi

నిర్మానుష్యంగా మారిన చిన్నోనిపల్లి

పొలాలిచ్చి ఎట్లా బతకాలి

మా గోడు చెప్పుకునేందుకు కూడా ఇంట్ల నుంచి బయటకు కూడా పంపుతలేరు. ఊరి చుట్టూ పోలీసులాయే. ఎక్కడికి పోవాలి, ఏమని చెప్పుకోవాలి. కలెక్టర్‌కు చెప్పుకుందామంటే ఊరిడిసి పొవాలే కదా. మాకు ఈ రిజర్వాయర్‌ వద్దు. పచ్చని పంట పొలాలను ఇడిసి ఎట్లా బతకాలే. పునరావాస కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. పిల్లలు చదువుకునేందుకు బడులు లేవు. రోడ్లు లేవు. ఉండడానికి ఇండ్లు లేవు. ఊరు ఇడిసి పెట్టమంటే ఎక్కడికి పోయి బతకాలే. – సంధ్య, చిన్నోనిపల్లె

ఇళ్లు లేవు, పట్టాల్లేవు

పునరావాస కేంద్రంలో ఇళ్లు లేవు, ఇళ్ల పట్టాల్లేవు. అధికారులేమో రిజర్వాయర్‌ కట్ట పనులు పూర్తి చేయడానికి ఉరుకులాడుతున్నారు. వానాకాలంలో వానలకు ఇళ్లలోకి నీళ్లు వస్తే రోడ్లపై ఉండాలా..? పునరావాస కేంద్రంలో ఏం పనులు చేయలేదు. ఊరిని వదిలి ఎట్లా పోవాలి.

– గోవిందమ్మ, చిన్నోనిపల్లె

న్యాయం చేయాలి

చిన్నోనిపల్లె భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి. గతంలో ఇచ్చిన పరిహారం ఎప్పుడో ఖర్చు అయిపోయింది. పెరిగిన రేట్లకు అనుకూలంగా పునరావాస కేంద్రంలో ఇళ్లు నిర్మించుకోవాలంటే ఇబ్బందే. ఈ భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఆయకట్టు లేకుండానే నిర్మించే రిజర్వాయర్‌ను రద్దు చేసి, రైతుల భూములను రైతులకే అప్పగించాలి. – పారిజాత, చిన్నోనిపల్లె

చర్యలు తీసుకుంటాం

చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ నిర్మాణం కోసం 2006లో రూ.32 కోట్లు కేటాయించారు. ఇందులో 90 శాతం మేర పనులు పూర్తయ్యాయి. కట్ట మధ్యలో 625 మీటర్ల గ్యాప్‌, స్లూయిజ్‌, అలుగు పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అవి పూర్తి చేస్తున్నాం. పునరావాస కేంద్రంలో రోడ్లు, తాగు నీరు, విద్యుత్‌ సరఫరా వంటి పనులు చేపడుతున్నాం.

– రహీముద్దీన్‌, ఈఈ

గద్వాల రూరల్‌/ గట్టు:

‘1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌ కింద ఒక్క ఎకరా ఆయకట్టు లేదు.. మమ్మల్ని ఊరు.. ఇళ్లు ఖాళీ చేయమంటే ఎట్లా. వ్యవసాయం తప్పా మాకేమీ తెల్వదు. రిజర్వాయర్‌ నిర్మించొద్దని.. న్యాయం చేయాలని మా ఊళ్లోని వారందరూ 423 రోజులు దీక్షలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ.. కలెక్టరేట్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సైతం గళం వినిపించారు.. అయినా మా మొర ఆలకించలే. రాత్రికి రాత్రి పోలీసులు ఇళ్లల్లోకి వచ్చి గ్రామంలోని మగవారందరినీ తీసుకెళ్లారు.. మమ్మల్ని ఇళ్ల నుంచి బయటికి రానివ్వడం లేదు. ప్రభుత్వం ఎందుకింత కర్కషంగా వ్యవహరిస్తుంది.. ముందుగా మా వారి ఆచూకీ చెప్పండి..’ అంటూ చిన్నోనిపల్లె మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సైతం చిన్నోనిపల్లె, రిజర్వాయర్‌ పనుల వద్ద భారీగా పోలీస్‌ బలగాలు మోహరించాయి. అధికారుల పర్యవేక్షణలో రిజర్వాయర్‌ పనులు కొనసాగాయి. ఇంతకీ చిన్నోనిపల్లిలో ఏం జరుగుతోంది.. పోలీసులు భారీ ఎత్తున ఎందుకు మోహరించారు.. అధికారులు హడావుడికి సంబంధించి పూర్తి వివరాలిలా..

2,500 ఎకరాలు ముంపు..

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 101 ప్యాకేజీలో గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామం వద్ద 1.50 టీఎంసీల సామర్థ్యంతో రూ.37 కోట్లతో రిజర్వాయర్‌ పనులను 2006లో పనులు పెట్టారు. మొదట పొలాలకు సాగునీరు అందిస్తామని రైతులను నమ్మించిన అధికారులు ఆ తర్వాత పొలాలకు సంబంధించి పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. పైగా తమ భూములకు ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించని రిజర్వాయర్‌ కోసం 2,500 ఎకరాల భూములతోపాటు 251 గడపలున్న గ్రామం మొత్తం ముంపునకు గురవుతుంటే నిర్వాసితులు తట్టుకోలేకపోయారు.దీంతో పనులు అడ్డుకు ని ఆందోళన చేయడం, అదే సమయంలో తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరడంతో 90 శాతం పూర్తయిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

దశాబ్దంన్నర తర్వాత..

సుమారు దశాబ్దంన్నరపాటు ఆగిపోయిన చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ పనులను పూర్తి చేసేందుకు ఏడాది కిందట సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చిన్నోనిపల్ల్లెని సందర్శించారు. ఈ క్రమంలో నిర్వాసిత గ్రామస్తులు పనులు ఆపేసి, రిజర్వాయర్‌ను రద్దు చేయాలని స్మితాసబర్వాల్‌కు విన్నవించారు. కానీ, ఆమె మిగిలిన పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించి వెళ్లడంతో నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 423 రోజులుగా ఐదు గ్రామాలకు చెందిన నిర్వాసిత రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఏకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సైతం దీక్ష చేపట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

చుట్టుముట్టూ బలగాలు..

ఏడాదిన్నరగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నిర్వాసితులను శనివారం పోలీసు బలగాలు అదుపులోకి తీసుకుని జిల్లాలోని శాంతినగర్‌, అయిజ పోలీసుస్టేషన్లకు తరలించారు. అలాగే చిన్నోనిపల్లిలో 144 సెక్షన్‌ విధించి ఎవరినీ బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. ఆదివారం తెల్లవారక ముందే పోలీసు బలగాలు చిన్నోనిపల్లిని చుట్టుముట్టేశాయి. దీంతో గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గ్రామంలో వృద్ధులు, మహిళలు, చిన్నిపిల్లలు మాత్రమే మిగిలారు. పనులు ప్రారంభించారనే విషయం తెలుసుకున్న కొందరు మహిళలు అడ్డుకునేందుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు.

చెక్‌పోస్టుల ఏర్పాటు

చిన్నోనిపల్లెకి చేరుకునే రహదారులన్నింటిని పోలీసులు మూసేశారు. మిట్టదొడ్డి స్టేజీ వద్ద కర్నూలు– రాయచూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై పోలీస్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. చాగదోన, చిన్నోనిపల్లె రోడ్డులో చాగదోన వద్ద మరో చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. లింగాపురం– చిన్నోనిపల్లి, అంతంపల్లి– చిన్నోనిపల్లి, బోయలగూడెం– చిన్నోనిపల్లి, ఇందువాసి ఇలా చిన్నోనిపల్లికి ఎన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉందో అన్నింటిపై బారీకేడ్లను ఏర్పాటు చేసి, పోలీస్‌ బలగాలను మోహరించారు. చిన్నోనిపల్లె వైపు వెళ్లే ప్రతి వ్యక్తిని, వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆయా చెక్‌ పోస్టుల దగ్గర వీడియో కూడా తీస్తున్నారు.

ఇంటెలిజెన్స్‌ అధికారుల ఆరా..

చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ పనులను ప్రారంభించిన తరుణంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మఫ్టిలో ఇంటిలిజెన్స్‌ అధికారులు గ్రామాల సరిహాద్దుల చుట్టు గ్రామస్తుల కదలికలపై నిఘా పెట్టారు. పనులను ఎవరైనా అడ్డుకునే అవకాశం ఉందా అనే విషయాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంటిలిజెన్స్‌ ఏఎస్పీ సత్యనారాయణ రిజర్వాయర్‌ పనులు జరిగే చోటకు వచ్చి వెళ్లారు.

రిజర్వాయర్‌ను రద్దు చేయాలి

చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ను రద్దు చేసి.. భూములను తిరిగి రైతులకు అప్పజెప్పాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం గట్టులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్‌ పనులు ప్రారంభించే క్రమంలో అర్థరాత్రి వేళ గ్రామానికి వెళ్లి అరెస్టు చేసి, పోలీస్‌ స్టేషన్లకు తీసుకెళ్లడం అన్యాయమని, గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధించడం సరికాదన్నారు. రైతులను విడిచి పెట్టాలన్నారు.

336మందికి ఇళ్ల పట్టాలు

నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ముంపునకు గురైన చిన్నోనిపల్లెలోని 360మందికిగాను 336 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినట్లు ఆర్డీఓ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం 2,500 ఎకరాలను 2005లో సేకరించినట్లు, ఇందుకు సంబంధించి నష్టపరిహారం అప్పట్లోనే అందజేశామని తెలిపారు. రైతులు పరిహారం సరిపోదని కోర్టుకు వెళ్లగా రెండవ విడతలో మళ్లీ రూ.14.82కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. చిన్నోనిపల్లెలో మిగిలిన 24పట్టాలను త్వరలోనే పంపిణీ చేస్తామని, భవిష్యత్తు తరాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పనులు పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని కోరారు.

రైతులను విడుదల చేయాలి : అఖిలపక్షం

శాంతినగర్‌: చిన్నోనిపల్లె రిజర్వాయర్‌ భూనిర్వాసితులను అక్రమంగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌లో ఉంచడం సరికాదని, వెంటనే విడుదల చేయాలని ప్రజాసంఘాలు, సీపీఐ, సీపీఎం, వైఎస్‌ఆర్‌టీపీ, టీజేఎస్‌, సీఐటీయూ అకిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం అర్ధరాత్రి చిన్నోనిపల్లె నుంచి నిర్వాసిత రైతులను పోలీసులు అరెస్టు చేసి శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అఖిలపక్షం నాయకులు ఆదివారం సాయంత్రం శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు మెట్ట రూ.70వేలు, తరి పొలానికి రూ.90 వేల చొప్పున ఇచ్చారని, అంతేగాక రిజర్వాయర్‌ నిర్మాణం వలన భూములు కోల్పోయిన రైతులకు ఒరిగేది లేదని, ఏడాదిపాటు నిరసనలు తెలిపినా పట్టించుకోకుండా అధికారులు పనులు చేపట్టడం ఎంతవరకు సబబని ఎస్‌ఐని ప్రశ్నించారు. స్పందించిన ఎస్‌ఐ శ్రీనివాసులు రైతులను సాయంత్రం విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించి వెళ్లిపోయారు. ఎస్‌ఐని కలిసిన వారిలో వైఎస్‌ఆర్‌టీపీ జిల్లా అధ్యక్షుడు అతీక్‌ రెహమాన్‌, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు ప్రకాష్‌గౌడ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నరసింహ, పరంజ్యోతి వున్నారు.

మా భర్తలెక్కడ..?

అర్ధరాత్రి ఇంట్లో ఉన్న భర్తలను పోలీసులు పట్టుకెళ్లారని, వారెక్కడున్నారో చెప్పాలని మహిళలు పెద్దఎత్తున ఇళ్ల నుంచి బయటకు వచ్చి, పనులు జరిగే చోటుకు తరలివెళ్లారు. కానీ, పోలీసు బలగాలు మధ్యలోనే వారిని అడ్డుకున్నాయి. డీఎస్పీ స్థాయి అధికారి మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని, పోలీసు బలగాలతో ఊరి నుంచి బయటకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారంటూ మహిళలు మండిపడ్డారు. ఏమైనా ఉంటే కలెక్టర్‌ను కలిసి చెప్పుకోవాలని, పనులు మాత్రం అడ్డుకోవడం కుదరదని పోలీసు అధికారులు మహిళలకు తేల్చిచెప్పి బలవంతంగా అక్కడి నుంచి వెనక్కి పంపారు.

గ్రామంతోపాటు రిజర్వాయర్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల

పర్యవేక్షణలో ప్రారంభమైన పనులు

తమవారి ఆచూకీ చెప్పాలని

మహిళల ఆందోళన

పనులు అడ్డుకునేందుకు ప్రయత్నం

అధికారుల పర్యవేక్షణలో..

చిన్నోనిపల్లె పెండింగ్‌ పనులను అధికారులు దగ్గరుండి కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు ఈఈ రహీముద్దీన్‌, జుబేర్‌ అహ్మద్‌, గద్వాల ఆర్డీఓ రాములు, డీఎస్పీ రంగస్వామి, తహసీల్దార్లు సుబ్రమణ్యం, అహ్మద్‌, ఏఈలు, డీప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌, ఆర్‌ఐలు శ్రీనివాసులు, కరీం, ఎంపీడీఓ చెన్నయ్యతోపాటు ఇరిగేషన్‌ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top