ఎస్‌ఎస్‌తాడ్వాయి/మంగపేట: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో రూ.4.46 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.83 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏటూరునాగారం మండలం శివాపూర్‌లో రూ.80లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, డ్రెయినేజీలు ప్రారంభించారు. గోగుపల్లిలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటూరునాగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు రూ.2.28 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా మంగపేట మండలంలో బుధవారం సాయంత్రం మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీఓ భద్రునాయక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


