● ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వలపై
నివేదిక అందించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: ఎల్‌నీనో ప్రభావంతో భవిష్యత్‌లో నీటి కొరత వచ్చే అవకాశం ఉన్నందున రైతులు తప్పనిసరిగా తక్కువ నీటితో పండి, అధిక లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో భవిష్యత్‌లో నీటి లభ్యత, పంటల మార్పిడి అంశాలపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంటల మార్పిడి, వైవిధ్యీకరణ చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 72వేల ఎకరాల్లో వరి వేశారని వెల్లడించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సాగు విస్తీర్ణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని వివరాలు, పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ డేటాలో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మితో పాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖల జిల్లా అధికారులు, ఏడీఏ, ఎంఏఓలు పాల్గొన్నారు.
నీటి నిల్వలపై నివేదిక అందించాలి..
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నీటి నిల్వలపై సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇరిగేషన్, మిషన్ భగీరథ వ్యవసాయ శాఖలతో నీటి లభ్యత, పంటల సాగుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో నీటి నిల్వలు, మంచినీటికి నీటి నిల్వలు, ఆయకట్టు పరిధిలోని సాగునీటి అవసరాలపై సమగ్ర నివేదికలు అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో, ఆయకట్టు పరిధి, రైతుల అవసరాలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించి, నీటి లభ్యత, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు సాగునీటి వినియోగంపై తగిన మార్గదర్శకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం కింద అర్హులైన కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధి కారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కా ర్యాలయం నుంచి చేయూత సామాజిక భద్రత పింఛన్లు కొరకు దరఖాస్తులు స్వీకరణ, జలసిరి, ప్రతీ సోమవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహణ, వనమహోత్సవం తదిత ర అంశాలపై ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చేయూత పింఛన్ల కొత్త మంజూరుకు సంబంధించి సెర్ఫ్ సర్క్యూలర్ ప్రకారం అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తు ప్రక్రియపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కా ర్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు.


