కోటగుళ్లలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

Jun 23 2026 1:10 AM | Updated on Jun 23 2026 1:10 AM

గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా గణపేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆరోగ్య రక్షణ

చర్యలు చేపట్టాలి

పలిమెల: జిల్లాలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన పలిమెల మండల పరిధిలోని గోదావరి సరిహద్దు గ్రామాల్లో వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ (టీపీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మండలం కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు పెరిగితే దోమల బెడద తీవ్రంగా పెరిగి, మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ వంటి విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను దోమల కాటు నుంచి రక్షించడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికీ రెండు నుంచి మూడు దోమతెరలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ దాసరి రమేష్‌, కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు ఐతే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ నాయకులు దారకొండ సూర్య శంకర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఓవర్‌లోడ్‌ లారీలను నియంత్రించాలి

భూపాలపల్లి రూరల్‌: మహదేవపూర్‌ మండలం పల్గుల గ్రామంలో అనుమతిలేని ఇసుక లారీలు ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్నాయని.. వాటిని నియంత్రించి చర్యలు తీసుకోవాలని పలుగుల వార్డు సభ్యులు రాగం వెంకటమ్మ, కొట్టె రాజయ్య, జిల్ల్లా సంతోష్‌, నిట్టురి రమేష్‌, నిట్టురి రమాదేవి సోమవారం డీపీఓ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. అక్రమంగా ఇళ్ల మధ్యనుంచి వెళ్తున్నాయని దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల

పేరుతో మోసాలు

భూపాలపల్లి అర్బన్‌: ఇటీవల కొంతమంది మోసగాళ్లు తమను ఫుడ్‌ సేఫ్టీ శాఖ అధికారులుగా పరిచయం చేసుకుంటూ దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులకు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆహార తనిఖి అధికారి వరుణ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు లేదా వారి సిబ్బంది ఎవరూ వ్యాపార సంస్థల యజమానులకు వ్యక్తిగతంగా ఫోన్‌ కాల్స్‌ చేయరని స్పష్టం చేశారు. ఎవరైనా తమను ఫుడ్‌ సేఫ్టీ శాఖ అధికారులమని చెప్పి ఫోన్‌ కాల్స్‌ చేసి డబ్బులు లేదా ఇతర వివరాలు కోరితే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

రూ.50 వేల ఆర్థిక సాయం

మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల డ్రాయింగ్‌ టీచర్‌ రేణిగుంట్ల చందర్‌ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని మండలంలోని ఉపాధ్యాయులు, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది చందర్‌ కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు. అనంతరం చందర్‌ కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగళి విజయపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు వెంకన్న, కుమారస్వామి, ప్రవీణ్‌, అనిల్‌, రాజు, శ్రీకళ, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ చంద్రమౌళి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement